విషాదం: మృతదేహాన్ని తీసుకెళ్తూ చావు ఒడిలోకి

Two Deceased In Road Accident In Prakasam - Sakshi

మృతదేహాన్ని తీసుకెళ్తూ లారీని ఢీకొన్న బొలెరో

ప్రమాదంలో మృతుడి పెద్ద కూతురు, చిన్న అల్లుడు మృత్యువాత

ముగ్గురి మరణంతో కుటుంబంలో పెను విషాదం

సాక్షి, బేస్తవారిపేట: చనిపోయిన వ్యక్తిని బొలెరో వాహనంలో తరలిస్తున్న సమయంలో లారీని ఢీకొనడంతో మరో ఇద్దరు మృతిచెందిన సంఘటన బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేరోడ్డుపై శనివారం తెల్లవారుజామున జరిగింది. కొమరోలు మండలం బుంగాయపల్లెకు చెందిన తురక వెంకట సుబ్బయ్య(73) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్త్రెవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతదేహాన్ని తీసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు పది మంది బొలెరో వాహనంలో బయలుదేరారు. మోక్షగుండం వద్దకు వచ్చే సమయానికి ముందున్న లారీ టైరు పంక్చర్‌ కావడంతో ఒక్కసారిగా వేగం తగ్గించి రోడ్డు మార్జిన్‌లోకి తీస్తున్న సమయంలో వెనుక వైపున బొలెరో ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలుకాగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. 

కూతురు, అల్లుడు దుర్మరణం.. 
హైదరాబాద్‌లో మృతిచెందిన వెంకట సుబ్బయ్య మొదటి కుమార్తె గంప సుబ్బలక్ష్మమ్మ(50), చిన్న కుమార్తె రమణమ్మ భర్త ఓరుసు దాసరయ్య(55) లు ఈ దుర్ఘటనలో మృత్యు ఒడిలోకి చేరారు. మృతదేహంతో వెళ్తున్న వాహనం ముందు భాగంలో డ్రైవర్‌ పక్కన కూర్చొని ఉన్న గిద్దలూరు మండలం బయనపల్లికి చెందిన దాసరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ గుండెపోటుతో వైఎస్సార్‌ జిల్లా పోరుమామిళ్ల మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మమ్మ మృతి చెందింది. సుబ్బయ్య దగ్గరి బంధువులు హైదరాబాద్‌లో ఏడేళ్లుగా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అతడు మరణించడంతో పది మంది మృతదేహాన్ని తీసుకుని వాహనంలో బయలుదేరారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన తురక ఉష, లక్ష్మీప్రియల పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. తురక పూజ, రమణమ్మ, దంప రమణమ్మలు గిద్దలూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. (చదవండి: అయిదో ఫ్లోర్‌ నుంచి పడి బాలుడు మృతి)

మూడు కుటుంబాల్లో విషాదం.. 
రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తండ్రి మరణంతో విషాదంలో ఉన్న కుమార్తెల కుటుంబాల్లోనూ పెను విషాదాన్ని మిగిల్చింది. పెద్ద కుమార్తె మరణం, చిన్న కుమార్తె భర్త మరణం, మనవరాళ్లకు తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా మారడంతో బంధువులు, కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. గిద్దలూరు సీఐ యు సుధాకరరావు, బేస్తవారిపేట ఎస్సై బాలకృష్ణలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top