రూ.1.26 కోట్లతో పరారైన దొంగలు దొరికారు

Three suspects arrestet in robbery case - Sakshi

పలు రాష్ట్రాల్లో జల్సాలు

సాంకేతిక సాయంతో పోలీసుల దర్యాప్తు

ముగ్గురు నిందితుల అరెస్ట్‌

రూ.1.11 కోట్ల నగదు రికవరీ 

నెల్లూరు (క్రైమ్‌): బ్యాంకులో జమ చేయాల్సిన నగదుతో పరారైన నిందితులు దొరికారు. వారి వద్ద నుంచి రూ.1,11,20,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా ఎస్పీ సీహెచ్‌ విజయారావు కేసు పూర్వాపరాలను విలేకరులకు వెల్లడించారు. నెల్లూరు సారాయంగడి సెంటర్‌కు చెందిన షేక్‌ రబ్బాని మూడేళ్లుగా బాలాజీనగర్‌లోని రైటర్స్‌ సేఫ్‌ గార్డ్స్‌ సంస్థలో కస్టోడియన్‌గా పనిచేస్తున్నాడు. సంస్థ నిర్దేశిత షాపింగ్‌మాళ్లు, హాస్పిటళ్లు తదితర సంస్థల వద్ద రోజువారీ కలెక్షన్‌ సేకరించి ఆ వ్యాపార సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో జమచేస్తుంటాడు.

ఈ క్రమంలో ఆగస్టు 31న రబ్బాని, అతని సహచర ఇద్దరు కస్టోడియన్లు రోజువారీ కలెక్షన్‌ రూ.1,26,08,450 నగదును సేకరించారు. దాన్ని బ్యాంకులో జమచేయాలని వారు రబ్బానికి ఇచ్చారు. రబ్బాని తన స్నేహితులైన సారాయంగడి సెంటర్‌కు చెందిన పాతనేరస్తుడు షేక్‌ రఫీ అలియాస్‌ గాంధీ, నెల్లూరు రూరల్‌ మండలం దేవరపాలెంకు చెందిన షేక్‌ మస్తాన్‌ అలియాస్‌ దూద్కలతో కలిసి నగదుతో ఉడాయించాడు. కొంత నగదును తెలిసిన వారివద్ద పెట్టి మిగిలిన నగదును తమవెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై సంస్థ రూట్‌ లీడర్‌ తిరుపతిరావు ఈనెల 1న చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగర, సీసీఎస్‌ డీఎస్పీలు జె.శ్రీనివాసులరెడ్డి, శివాజీరాజా తమ సిబ్బందితో 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

పోలీసులు సాంకేతికతను వినియోగించుకుని నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిందితులు పోలీసులకు చిక్కకుండా ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుతూ జల్సాలు చేయసాగారు. తీసుకెళ్లిన నగదు ఖర్చు అయిపోవడంతో మిగిలిన నగదును తీసుకెళ్లేందుకు సోమవారం నెల్లూరుకు వచ్చారు. నవబాల దుర్గాదేవి గుడి సమీపంలోని చెరువుకట్ట వద్ద ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి రూ.1,11,20,000 నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top