పీజీ వైద్యవిద్యార్థిని అనుమానాస్పద మృతి 

Telangana Medico Dies Under Mysterious Circumstances In Nizamabad - Sakshi

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన 

ఉత్తమ ప్రతిభతో ఉన్నత చదువులు

నిరుపేద కుటుంబ నేపథ్యం..  

అత్యుత్తమ ప్రతిభతో ఉన్నత విద్యాభ్యాసం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/నిజామాబాద్‌ అర్బన్‌/తిమ్మాపూర్‌(మానకొండూర్‌): నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో పీజీ వైద్యవిద్యార్థిని డాక్టర్‌ గుర్రం శ్వేత(27) శుక్రవారం తెల్లవారుజామున అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. శ్వేత పీజీ గైనకాలజీ చదువుతోంది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మరో ఇద్దరు పీజీ గైనకాలజిస్టులతో కలసి ఆమె విధులకు హాజరైంది.

రాత్రి 2 గంటలకు పేషంట్లను చూసి వచ్చిన శ్వేత 3 గంటల సమయంలో నిద్రపోయేందుకు గదిలోకి వెళ్లింది. తెల్లవారుజామున 3.45 గంటలకు రోగులను పరీక్షించే నిమిత్తం శ్వేతను నిద్ర లేపేందుకు తోటి పీజీ వైద్యులు ప్రయత్నించారు. అయినా ఆమె నిద్ర నుంచి మేల్కోలేదు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ నిద్రలేపేందుకు ప్రయత్నించినా ఉలుకూపలుకూ లేకపోవడంతో స్టాఫ్‌ నర్సులతో కలసి ఆమెను పరిశీలించారు.

ఆ తర్వాత శ్వేత చనిపోయిందని నిర్ధారించుకున్నారు. ఉదయం 6 గంటలకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ వచ్చి పరిశీలించి శ్వేత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మొదట గుండెపోటుతో మృతి చెందినట్లు సూపరింటెండెంట్‌ చెప్పారు. తరువాత కోవిడ్‌ అనంతర లక్షణాలతో చనిపోయినట్లు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక వాస్తవం తెలుస్తుందని పేర్కొన్నారు.

అనుమానాస్పద మృతిగా చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అడిషనల్‌ డీసీపీ డాక్టర్‌ వినీత్‌ అన్నారు. అయితే పోలీసులు మాత్రం అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకున్నారు. శ్వేత మృతికి కార్డియాక్‌ అరెస్ట్‌ కారణమంటున్నారు ఆమె సహచర విద్యార్థినులు. శ్వేత గతంలో రెండుసార్లు కోవిడ్‌ బారిన పడిందని, దాని ప్రభావంతోనే కార్డియాక్‌ అరెస్ట్‌ అయి ఉంటుందని పేర్కొంటున్నారు.

శ్వేత సోదరుడు కిరణ్‌ వచ్చిన తరువాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అనంతరం ఆస్పత్రి నుంచి రోడ్డు వరకు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్, వైద్యులు, వైద్య విద్యార్థులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు.  శ్వేత మృతదేహం నిజామాబాద్‌ నుంచి శుక్రవారం రాత్రి 10 గంటలకు కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌కు చేరుకుంది. శ్వేతను కడసారి చూసేందుకు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. ఉన్నత ఆశయంతో వైద్య విద్య చదువుతున్న శ్వేతను నిర్జీవంగా చూసి కన్నీరుపెట్టారు.  

చిన్నప్పటి నుంచి చదువులో చురుకు 
అత్యుత్తమ ప్రతిభతో ఉన్నత వైద్యవిద్యను అభ్యసిస్తున్న గుర్రం శ్వేత జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన శ్వేత తండ్రి శ్రీనివాస్‌ కరీంనగర్‌లోని హౌసింగ్‌ బోర్డులో వాచ్‌మన్‌. తల్లి కళావతి గృహిణి. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లికి చెందిన వీరి కుటుంబం కరీంనగర్‌లోని తిమ్మాపూర్‌లో స్థిరపడింది.

శ్వేత పదో తరగతిలో 547/600 మార్కులు, ఇంటర్‌లో 944/1,000 మార్కులు, ఎంబీబీఎస్‌లో ఫ్రీ సీటు సాధించి కరీంనగర్‌లో కోర్సు పూర్తిచేసింది. పీజీ వైద్యవిద్యకు సంబంధించి ఆలిండియాస్థాయిలో 4,891 ర్యాంకు సాధించి 2021 జూన్‌ 17న నిజామాబాద్‌ మెడికల్‌ కళాశాలలో పీజీ గైనకాలజీలో చేరింది. 2023 జూన్‌ 25న కోర్సు పూర్తి కానుంది. శ్వేతకు పెళ్లి సంబంధాలు సైతం వస్తున్నాయి. శ్వేత అన్నయ్య కిరణ్‌ జార్ఖండ్‌లో సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా పనిచేస్తున్నారు. 

ఎండలు ఉన్నాయి.. బయటకు వెళ్లొద్దు..  
రోజూ రాత్రి 8 గంటలకు భోజనం చేశాక శ్వేత తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటుంది. గురువారంరాత్రి కూడా తల్లికి ఫోన్‌ చేసి ‘ఎండలు మండిపోతున్నాయి అమ్మా.. నాన్నను ఊకే బయటకు వెళ్లొద్దని చెప్పు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. జ్యూస్‌లు ఎక్కువ తాగండి’ అని చెప్పింది. ఇలా జాగ్రత్తలు చెప్పిన శ్వేత తెల్లారేసరికి అకస్మాత్తుగా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top