నీట మునిగి ఇంజినీరింగ్‌ విద్యార్థి గల్లంతు

Student Drowned In Pond In Chittoor District - Sakshi

స్నేహితులతో చెరువులోకి దిగిన విద్యార్థి 

నిమిషాల్లోనే మునిగిపోయిన వైనం

గాలింపు చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది

గుండెలవిసేలా విలపించిన తల్లి 

మదనపల్లె టౌన్‌: మదనపల్లె మండలంలో శుక్రవారం సరదాగా ఈతకు వెళ్లిన మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి నీటిలో గల్లంతయ్యాడు. అగ్ని మాపక సిబ్బంది కథనం మేరకు.. కొండామారిపల్లెకు చెందిన బైలు గంగిరెడ్డి, సుజాతమ్మ దంపతుల పెద్ద కుమారుడు మణికంఠ (21) అంగళ్లులోని ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చువుతున్నాడు. అతను అదే గ్రామానికి చెందిన మునిరత్నం కుమారుడు గణజగదీశ్వర్‌(21), సుధాకర్‌ కుమారుడు కిరణ్‌ సాయి (21)తో కలిసి శుక్రవారం గ్రామ సమీపంలోని బసినికొండ బైపాసు రోడ్డులో ఉన్న స్వామి చెరువుకు ఈతకు వెళ్లారు.

ఈత కొట్టే క్రమంలో మణికంఠ లోతుగా ఉన్న నీటిలోకి వెళ్లి తిరిగి గట్టుకు రాలేకపోయాడు. స్నేహితులు చూస్తుండగానే మునిగిపోయాడు. వారు గ్రామస్తులకు సమాచారం అందించి చెరువులో గాలించినా ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారి కరుణాకర్‌ తన సిబ్బందితో చెరువు వద్దకు చేరుకుని చీకటి పడేవరకూ గాలించారు. శనివారం ఉదయం మళ్లీ గాలిస్తామని తెలిపారు. సంఘటనా స్థలం వద్దకు రూరల్‌ ఏఎస్‌ఐ మహదేవనాయక్‌ తదితరులు చేరుకుని ఘటనపై మణికంఠ స్నేహితులను ఆరాతీశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 
నాయనా నన్నూ నీతో పాటే  తీసుకుపోరా.. 
నాయనా..! నన్నూ నీతోపాటే తీసుకుపోరా.. బిడ్డ బాగా చదువుకుంటున్నాడు. ఇంజినీర్‌ అయి బాగా చూసుకుంటాడని అనుకుంటే మాకంటే ముందే ఆ దేవుడు నిన్ను తీసుకుపాయనే.. ఇక మేమెట్ల బతకాలి తండ్రీ.. నీ చదువుకోసం మీ నాన్న సౌదీలో ఉంటూ నాలుగేళ్లుగా కష్టాలు భరించాడే.. నాలుగు రోజుల క్రితం సౌదీ నుంచి ఇంటికి వస్తుంటే విమానాశ్రయం నుంచే నేరుగా తిరుపతి క్వారంటైన్‌కు తీసుకుపోయారే.. నీ తండ్రికి చివరి చూపు కూడా లేకుండా చేశావా నాయనా.. నన్నూ నీతోపాటే తీసుకుపోరా.. అంటూ విద్యార్థి తల్లి సుజాతమ్మ చేస్తున్న రోదనలు చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top