‘ఎందుకమ్మ ఇట్ల చేసినవ్‌..?.. అసలేమైంది బిడ్డా.. అన్నీ అనుమానాలే!

Student Body found in Lakshmipur Reservoir in Jainad - Sakshi

లక్ష్మీపూర్‌ రిజర్వాయర్‌లో విద్యార్థిని మృతదేహం

అపస్మారక స్థితిలో మరో విద్యార్థిని

మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు

సాక్షి, జైనథ్‌ (ఆదిలాబాద్‌): ‘ఎందుకమ్మ ఇట్ల చేసినవ్‌..? మమ్మల్ని ఒంటరి వాళ్లను చేసి ఎందుకు వెళ్లిపోయినవమ్మా? మమ్మీ.. డాడీ గుర్తుకు రాలేదా.. అసలేమైంది బిడ్డా..’ అంటూ కూతురు మృతదేహం వద్ద తల్లి మరాఠీలో గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. మండలంలోని లక్ష్మీపూర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో ఓ విద్యార్థిని మృతదేహం లభించగా.. మరో విద్యార్థిని అపస్మారక స్థితిలో కనిపించడం కలకలం రేపింది.  

బేల మండల కేంద్రానికి చెందిన పాటిల్‌ ప్రియాంక(14) జైనథ్‌ మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. జైనథ్‌కు చెందిన పారిక్‌ ప్రీతి కూడా అక్కడే పదో తరగతి చదువుతోంది. ఇద్దరూ ఒకే తరగతి కావడంతో ఎప్పుడూ కలిసి మెలిసి ఉండేవారు. మిత్రులుగా, చురుకైన విద్యార్థినులుగా వీరికి పేరుంది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా ఇద్దరు కలిసి హిందీ ఉపాధ్యాయులుగా విద్యార్థులకు పాఠాలు బోధించారు.

అయితే హఠాత్తుగా బుధవారం మధ్యాహ్నం ప్రియాంక మృతదేహం లక్ష్మీపూర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో లభించడం కలకలం రేపింది. పారిక్‌ ప్రీతి సైతం అదే రిజర్వాయర్‌లో అపస్మారక స్థితిలో లభించడంతో అసలు ఏం జరిగి ఉంటుందని రెండు మండలాల్లో చర్చనీయాంశమైంది. అటుగా వెళ్తున్న కొంతమంది విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో ప్రీతిని బయటకు తీసి, మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగుపడినట్లు వైద్యులు చెబుతున్నారు.

సంఘటన స్థలం వద్ద లభించిన బెల్టు 

మిన్నంటిన రోదనలు
ప్రియాంక తల్లిదండ్రులు విపుల్‌–సంగీత వ్యవసాయ కుటుంబం. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వీరిలో ప్రియాంక అందరి కంటే పెద్దది. ప్రతిరోజు బేల నుంచి జైనథ్‌కు స్కూల్‌కు బస్సులో వెళ్లి వచ్చేది. ఉన్నత చదువులు చదివి ఎంతో ఎత్తుకు ఎదుగుతుందనుకున్న తమ బిడ్డ ఇలా శవమై తేలిందంటూ సంఘటన స్థలం వద్ద తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కదిలించింది.  

చదవండి: (విషాదం: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. నేడు నవ్వుతూ ఇంట్లో ఉండేది)

వీడని ఉత్కంఠ..
అపస్మారక స్థితిలో లభించిన ప్రీతి రిమ్స్‌లో కొంత కోలుకోవడంతో పోలీసులు ఆమె నుంచి సమాచారం రాబట్టేందుకు యత్నించారు. అయితే భయాందోళనలో ఉన్న ఆమె తాము ఇద్దరం పాఠశాలకు వెళ్లకుండా కాలినడక రిజర్వాయర్‌ వద్దకు వెళ్లినట్లు చెప్పినట్లు తెలిసింది. ఫొటోలు దిగే క్రమంలో ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లోకి పడిపోయామని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే ఇద్దరి వద్ద కూడా సెల్‌ఫోన్‌లు లేకపోవడంతో వీరి వెంట ఇంకా ఎవరో ఉండి ఉంటారని పోలీసులు, ఇరు కుటుంబాల సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రీతి ఇప్పుడిప్పుడే కోలుకోవడంతో ఆమెను మరిన్ని ప్రశ్నలు అడిగి విసిగించవద్దని వైద్యులు పోలీసులకు సూచించినట్లు తెలిసింది. దీంతో మృతురాలు ప్రియాంక తల్లి సంగీత ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పెర్సిస్‌ బిట్ల తెలిపారు.

 

ఉలిక్కిపడ్డ మండలం..
అభం శుభం తెలియని టీనేజ్‌ విద్యార్థినుల్లో ఒకరి శవమై తేలడం, మరొకరు కొన ఊపిరితో అపస్మారక స్థితిలో రిజర్వాయర్‌లో లభించడంతో మండల వాసులు ఉలిక్కి పడ్డారు. బడి మానేసి దాదాపు రెండు కిలోమీటర్లు కాలినడక రిజర్వాయర్‌కు ఎందుకు వెళ్లారు? వీరి వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదా నిజంగానే సెల్ఫీల మోజు ప్రాణం తీసిందా? అని చర్చించుకుంటున్నారు. 

అన్నీ అనుమానాలే!
జైనథ్‌కు చెందిన పారిక్‌ ప్రీతికి చెందిన పుస్తకాల బ్యాగు పాఠశాలకు, రిజర్వాయర్‌కు నడుమ ఉన్న పెన్‌గంగ కెనాల్‌ వెంబడి ఓ రైతుకు దొరినట్లు పోలీసులు చెబుతున్నారు. రైతు నేరుగా ఈ బ్యాగ్‌ను పాఠశాలలో అప్పగించడంతో చర్చ మొదలైంది. పుస్తకాల బ్యాగు అటు రిజర్వాయర్‌ వద్ద కాకుండా, ఇటూ పాఠశాల వద్ద కాకుండా కెనాల్‌ వెంబడి ఎందుకు పడి ఉంది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే మృతిచెందిన విద్యార్థినికి సంబంధించిన బ్యాగు ఏమైందో ఇంకా అంతుపట్టడం లేదు. సంఘటన స్థలంలో ఆమె స్కూల్‌ డ్రెస్‌ నడుము బెల్ట్‌ మాత్రమే లభించడంతో ఆ బ్యాగు కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు పడి ప్రియాంక పూర్తిగా నీళ్లలో ఎందుకు పడిపోయారు? ప్రీతి మాత్రం ఎవరో జాగ్రతగా ఒడ్డుకు చేర్చినట్లు ఎందుకు ఒడ్డున అపస్మారక స్థితిలో లభించిందనేది ఇంకా అంతుచిక్కడం లేదు. గురువారం వరకు ప్రీతి ఆరోగ్యం కొంత కుదుట పడితే గాని పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top