కాళీచరణ్‌ అరెస్ట్‌

Raipur Police arrest Kalicharan Maharaj - Sakshi

ఖజురహో సమీపంలో అరెస్ట్‌ చేసిన ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ మధ్య రగడ

రాయ్‌పూర్‌: మహాత్మాగాంధీపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందూ సాధువు కాళీచరణ్‌ మహరాజ్‌ను ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తమ రాష్ట్రం నుంచి అనుమతి లేకుండా ఆయన్ను అరెస్ట్‌ చేయడం అంతర్రాష్ట్ర ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమేనంటూ మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.

కాళీచరణ్‌ మహరాజ్‌ అలియాస్‌ అభిజీత్‌ ధనంజయ్‌ సరాగ్‌ను ఖజురహోకు 25 కిలోమీటర్ల దూరంలోని బాగేశ్వర్‌ధామ్‌లోని ఓ అద్దె ఇంట్లో మారుపేరుతో ఉండగా గురువారం వేకువజామున అదుపులోకి తీసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘేల్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మహాత్మాగాంధీని అవమానించిన వ్యక్తిని అరెస్ట్‌ చేసినందుకు సంతోషిస్తున్నారా, లేక విచారిస్తున్నారా తెలపాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  కాళీచరణ్‌ను గురువారం రాత్రి కోర్టులో హాజరుపరచగా రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి అప్పగించారు.

ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల చర్య తీవ్ర అభ్యంతరకరమని మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా వ్యాఖ్యానించారు.  ఛత్తీస్‌గఢ్‌ ప్రభు త్వం అంతర్రాష్ట్ర ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిందని ఆరోపించారు. ఆదివారం రాయ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో కాళీచరణ్‌ మాట్లాడుతూ.. ‘రాజకీయాలు చేసి దేశాన్ని కబళించడమే ఇస్లాం లక్ష్యం. మన కళ్లముందే 1947లో దేశ విభజన జరిగింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ విడిపోయాయి. గాంధీని తు పాకీతో కాల్చి చంపిన నాథూరాం గాడ్సేకి సెల్యూట్‌ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు పశ్చాత్తాప పడటం లేదని, గాంధీని ద్వేషిస్తానని సర్దార్‌ పటేల్‌ ప్రధాని కాకుండా గాంధీయే అడ్డుపడ్డారని  కూడా ప్రకటన చేశారు. కాళీచరణ్‌పై మహారాష్ట్రలోనూ పలు కేసులు నమోదయ్యాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top