1995లో హత్య.. అనూహ‍్య రీతిలో ఇప్పుడు దొరికిన యూట్యూబర్‌ | Popular YouTuber Arrested For Killing Boy 31 Years Ago | Sakshi
Sakshi News home page

1995లో హత్య.. అనూహ‍్య రీతిలో ఇప్పుడు దొరికిన యూట్యూబర్

Apr 25 2026 3:18 PM | Updated on Apr 25 2026 3:44 PM

  Popular YouTuber Arrested For Killing Boy 31 Years Ago

న్యూఢిల్లీ: ఓ వ్యక్తి 31 ఏళ్ల క్రితం ఓ బాలుడిని హత్య చేశాడు. అనంతరం బెయిల్‌పై విడుదలై తప్పించుకు తిరుగుతున్నాడు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అతడు పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే... నిందితుడి పేరు సలీమ్ ఖాన్. కొన్నేళ్లుగా సలీమ్ వాస్తిక్ పేరుతో జీవిస్తున్నాడు. యూట్యూబ్‌ ఛానెల్‌ నడుపుతూ పేరు తెచ‍్చుకున్నాడు. ‘ఎక్స్ ముస్లిం’గా తనను తాను ప్రచారం చేసుకున్నాడు.

గత నెల ఘాజియాబాద్‌లో ఇద్దరు వ్యక్తులు సలీమ్ వాస్తిక్‌పై అతని ఇంట్లో కత్తితో దాడి చేశారు. సలీమ్‌ నాస్తిక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో సలీమ్ వాస్తిక్‌ గురించి పోలీసులు ఆరా తీశారు. దీంతో అతడు పేరు మార్చుకుని జీవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సలీమ్ వాస్తిక్‌ పాత రికార్డులు, వేలిముద్రలు, ఫొటోలను పోలీసులు పరిశీలించారు. అతడు పాత నేరస్తుడని తేల్చారు. అతడికి కిడ్నాప్, దోపిడి కోసం బెదిరింపులు, హత్య ఆరోపణలపై తిహార్ జైలులో జీవిత ఖైదు శిక్ష విధించారని తేల్చారు.

1995లో బాలుడి కిడ్నాప్‌, హత్య 
ఈ హత్య కేసు 1995, జనవరి 20కి సంబంధించినది. సిమెంట్ వ్యాపారవేత్త కుమారుడు సందీప్ బన్సాల్ ఢిల్లీలో పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబం ఎంతగా వెతికినా అతడి కనుగొనలేకపోయింది. మరుసటి రోజు వ్యాపారవేత్తకు ఫోన్ కాల్ వచ్చింది. అతని కుమారుడిని అపహరించామని, సురక్షితంగా విడుదల చేయాలంటే రూ.30,000 డబ్బు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్‌ చేశారు. ఫ్లైఓవర్ సమీపంలో బస్సులో డబ్బు పెట్టాలని, పోలీసులకు సమాచారం ఇస్తే బాలుడిని చంపేస్తామని కిడ్నాపర్లు హెచ్చరించారు. కుటుంబం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. గోకుల్‌పురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

దర్యాప్తు సమయంలో ఆ వ్యాపారవేత్త పొరుగింటి వ్యక్తి కీలక సమాచారం ఇచ్చాడు. ఆ బాలుడు ‘మాస్టర్‌జీ’ అనే పొడవైన యువకుడితో ఆటోరిక్షాలో వెళ్తున్నట్లు తాను చూశానని తెలిపాడు. దీంతో పోలీసులు సలీమ్ ఖాన్ (ప్రస్తుతం సలీమ్ వాస్తిక్)ను గుర్తించారు. అతను దర్యాగంజ్‌లోని రామ్‌జాస్ పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేవాడు. అతను నేరాన్ని ఒప్పుకొని ముస్తఫాబాద్‌లోని కాలువ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలుడి మృతదేహం లభించింది.

వాస్తిక్‌కు సహకరించిన అనిల్ అనే వ్యక్తికి కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడి స్కూల్ బ్యాగ్, టిఫిన్ బాక్స్, గడియారం స్వాధీనం చేసుకొని కోర్టులో సాక్ష్యాలుగా సమర్పించారు. 1997 ఆగస్టు 5న కర్కర్డూమా కోర్టు సలీమ్ ఖాన్ (అలియాస్ సలీమ్ వాస్తిక్) అనిల్‌ను దోషులుగా తేల్చి జీవిత ఖైదు శిక్ష విధించింది. ఇద్దరూ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశారు. 2000, నవంబర్ 24న సలీమ్‌కు తాత్కాలిక బెయిల్ ఇచ్చారు. తర్వాత అతడు పరారయ్యాడు. సలీమ్ ఆ తర్వాత సలీమ్ వాస్తిక్, సలీమ్ అహ్మద్ పేర్లతో జీవించాడు.

తదుపరి 26 సంవత్సరాలు హరియాణాలోని కర్నాల్, అంబాలా ప్రాంతాల్లో దాక్కొని వార్డ్రోబ్ తయారీ పనులు చేశాడు. తర్వాత 2010లో ఘాజియాబాద్ లోని ఓ ప్రాంతానికి మారి మహిళల దుస్తుల దుకాణం ప్రారంభించాడు. సలీమ్ సామాజిక కార్యకర్తగా, యూట్యూబర్‌గా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ఉగ్రవాదం, మత అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు, వీడియోలతో ప్రసిద్ధి చెందాడు.

జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. అతని జీవితం ఆధారంగా ఒక బాలీవుడ్ నిర్మాత బయోపిక్ తీసేందుకు నిర్ణయించాడు. ప్రాజెక్ట్ కోసం రూ.1.5 మిలియన్ అడ్వాన్స్ ఇచ్చారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభంకాక ముందే ఇది జరగకముందే సలీమ్ అరెస్ట్ అయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement