భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడనే ఘాతుకం

Police solved Auto Driver Naresh assassination Case In Nalgonda - Sakshi

స్నేహ బంధానికి ద్రోహం చేసి తన భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడని అనుమానం పెంచుకున్నాడు.. మానసిక క్షోభకు  కారణమయ్యాడని మిత్రుడినే బద్ధ శత్రువుగా భావించి అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అదును చూసి మరో మిత్రుడి సహకారంతో దారుణంగా హత్య చేసి.. ఆపై ప్రమాదంగా చిత్రీకరించాడు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడడంతో చివరకు కటకటాలపాలయ్యాడు. ఇదీ.. సూర్యాపేట జిల్లా మోతె మండలం అన్నారిగూడెం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన హత్యోందంతం వెనుక ఉన్న ప్రధాన కారణం. 

నల్గొండ: మోతె మండలం అన్నారిగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ నరేశ్‌ మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అతడి మరణం ప్రమాదవశాత్తు జరిగిందని కాదని.. హత్యేనని తేల్చారు. ఘాతుకానికి ఒడిగట్టిన సూత్రధారితో పాటు మరో ఇద్దరు పాత్రధారులను అరెస్ట్‌ చేశారు. మునగాల పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో సోమవారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన పంది నరేశ్‌ (28), పడిశాల శంకర్‌ది ఒకే సామాజిక వర్గం. ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. వివాహాలు చేసుకుని నరేశ్‌ ఆటో డ్రైవర్‌గా, శంకర్‌ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 

అనుమానం పెంచుకుని..
నరేశ్, శంకర్‌ ఇద్దరూ స్నేహితులు కావడంతో ఒకరింటికి ఒకరు వచ్చి పోతుండేవారు. శంకర్‌ లేని సమయంలో కూడా నరేశ్‌ ఇంటికి వచ్చి వెళ్తూ తన భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడని అనుమానం పెంచుకున్నాడు. ఆ విషయంలో తాను ఎక్కడా భయటపడకుండా నరేశ్‌తో స్నేహంగా ఉంటూనే అతడిపై కక్ష పెంచుకున్నాడు. అదును చూసి హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. 

మరో మిత్రుడి సహకారం తీసుకుని..
నరేశ్‌ని హత్య చేయడం తన ఒక్కడితో కాదని కారుడ్రైవర్‌గా పనిచేస్తున్న ఖమ్మం జిల్లా తిరుమాలయపాలెం మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన తన మిత్రుడు గుండెపంగు మధుసూదన్‌ సహకారం తీసుకుని పథకం రూపొందించి అమలు కోసం వేచి చూస్తున్నాడు. అందుకు అతడికి రూ.30వేలు ఇచ్చాడు. అందులో భాగంగా నవంబర్‌ 26న నరేశ్‌ తన అత్తగారి గ్రామం మునగాలలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. అప్పటికే స్నేహితుడు మధుసూదన్‌ను రప్పించుకున్న శంకర్‌ మద్యం సేవిద్దామని నరేశ్‌కు కబురు పెట్టాడు. దీంతో నరేశ్‌ అదేరోజు రాత్రి మోతె మండలం విభళాపురం గ్రామ శివారులో గల స్టీలు ప్లాంటు వద్దకు ఆటోలో చేరుకొని వారిద్దరితో కలిసి పూటుగా మద్యం సేవించాడు. నరేశ్‌ పూర్తిగా మత్తులోకి వెళ్లాక ఆటోలోనే మెడకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం ఆటోను పక్కనే ఉన్న ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలోకి తోసేసి ప్రమాదంగా చిత్రీకరించారు. అనంతరం అన్నారిగూడెం గ్రామానికి చెందిన మరో మిత్రుడు దున్నపోతుల వెంకటేశ్వర్లుకు హత్యోదంతాన్ని వివరించారు. మధుసూదన్‌ను బైక్‌పై అతడి స్వగ్రామంలో విడిచిపెట్టి శంకర్, వెంకటేశ్వర్లు అన్నారిగూడెం చేరుకున్నారు.

అనుమానంతో అదుపులోకి తీసుకుని..
ఇటీవల ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలో నరేశ్‌ విగతజీవుడిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు అతడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా నరేశ్‌ స్నేహితుడు శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. కేసులో భాగస్వాములైన మధుసూదన్‌ను ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెం టోల్‌ప్లాజా వద్ద, వెంకటేశ్వర్లును అతడి స్వగ్రామంలో అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ వివరించారు. కేసును ఛేదించిన మునగాల సీఐ ఆంజనేయులు, మోతె ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, సిబ్బందిని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. సమావేశంలో మునగాల, నడిగూడెం ఎస్‌ఐలు లోకేశ్, నాగభూషణ్‌రావు తదితరులు ఉన్నారు.   

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top