రేప్‌ కేసు: అతడే ప్రధాన నిందితుడు! | Panjagutta Molestation Case: May Dollar Bhai Is a Become A Main Accused In Case | Sakshi
Sakshi News home page

రేప్‌ కేసు: ఎన్‌జీఓ డాలర్‌ భాయ్‌ ప్రధాన నిందితుడు!

Sep 3 2020 8:23 AM | Updated on Sep 3 2020 5:22 PM

Panjagutta Molestation Case: May Dollar Bhai Is a Become A Main Accused In Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిర్యాలగూడకు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసుస్టేషన్‌లో నమోదైన అత్యాచారం కేసులో కొత్త ట్విస్ట్‌ వచ్చింది. ఇప్పటి వరకు బాధితురాలికి ‘అండగా’ ఉండి, ఆమెతో ఫిర్యాదు చేయించిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడే ప్రధాన నిందితుడిగా మారనున్నాడు. తాజా పరిణామాల నేపథ్యంలో బాధితురాలి నుంచి మరోసారి వాంగ్మూలం నమోదు చేయాలని సీసీఎస్‌ పోలీసులు నిర్ణయించారు. న్యాయస్థానంలోనూ స్టేట్‌మెంట్‌ రికార్డు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పదకొండేళ్ళుగా 143 మంది తనపై అత్యాచారం చేశారంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత పంజగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో కొందరు ప్రముఖులు కూడా నిందితుల జాబితాలో ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి బదిలీ అయింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సుకత రేపిన ఈ కేసు దర్యాప్తు కోసం సీసీఎస్‌ మహిళ ఠాణా ఏసీపీ శ్రీదేవిని ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గా నియమించారు. ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా చేస్తుండగానే సోమవారం బాధితురాలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పిన విషయాలు కొత్త ట్విస్ట్‌కు కారణమయ్యాయి. సోమాజిగూడలో స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తూ, తనకు సాయం చేస్తున్నట్లు నటించిన రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ డాలర్‌ భాయ్‌ కారణంగానే ఈ ఫిర్యాదు చేసినట్లు  బాధితురాలు పేర్కొంది. అతగాడు చెప్పిన పేర్లు తన ఫిర్యాదులో పొందుపరిచానంటూ వెల్లడించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సీసీఎస్‌ పోలీసులు ఈ కేసులో డాలర్‌ భాయ్‌ని ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నారు. బాధితురాలి నుంచి గతంలో ఓసారి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు.

అయితే అప్పుడు ఆమె చెప్పిన వివరాలకు, తాజాగా విలేకరుల సమావేశంలో వెల్లడించిన వాటికి చాలా తేడా ఉంది. దీంతో బాధితురాలి నుంచి మరోసారి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ఈ కేసు నిందితుల జాబితాలో మార్పు చేయనున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఆమెతో న్యాయస్థానంలోనూ 164 స్టేట్‌మెంట్‌ రికార్డు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మాజీ భార్య ఫిర్యాదుతో ఇప్పటికే డాలర్‌ భాయ్‌పై సీసీఎస్‌ మహిళా ఠాణాలో ఓ కేసు నమోదై ఉంది. ఇటీవల జరిగిన ఫోన్‌ బెదిరింపుల నేపథ్యంలో నల్లగొండలో తాజాగా మరో కేసు నమోదైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement