అన్నతో ఎంగేజ్‌మెంట్, తమ్ముడితో పెళ్లి.. ఆపై ఆత్మహత్య

Newly Married Women Suicide For House Harassment - Sakshi

హైదారాబాద్: పెళ్లయి నెల గడవక ముందే ఓ యువతి జీవితం బలైపోయింది. తన ప్రమేయం లేకుండానే ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములతో ఒకరితో ఎంగేజ్‌మెంట్, మరొకరితో వివాహం చివరికి ఆ యువతిని బలికొంది. ఇక పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.. పాతబస్తీకి చెందిన షబ్బీర్‌ అలీ కుమార్తె షాహిన్‌తో జల్‌పల్లి న్యూ బాబానగర్‌‌కు చెందిన మీర్‌ ఇస్మాయిలుద్దీన్ అలీకి గత నెల 12న పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. అయితే మూడు సంవత్సరాల క్రితమే ఇస్మాయిలుద్దీన్ వివాహం చేసుకున్న షాహిన్‌భేగంకు తన అన్నయ్య జలాలుద్దీన్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగింది. 

ఎంగేజ్‌మెంట్ జరిగిన కొన్నాళ్ళకి ఉపాధి నిమిత్తం అన్నదమ్ములిద్దరూ దుబాయికి వెళ్లారు. అయితే కరోనా వైరస్‌ నేపథ్యంలో వివాహం చేసుకునేందుకు జలాలుద్దీన్‌ దుబాయి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. అయితే కొద్ది రోజుల క్రితమే తన తమ్ముడు ఇస్మాయిలుద్దీన్ అలీ మాత్రం తిరిగి తన స్వస్థలం చేరుకున్నాడు. ఇది ఇలా ఉండగా దుబాయ్‌లో జలాలుద్దీన్‌ ఆచూకి తెలియని పరిస్థితి కుటుంబ సభ్యులకు ఎదురైంది. దీనితో తప్పని పరిస్తితుల్లో ఇరు కుటుంబాల పెద్దలు చర్చించి షాహిన్‌ను ఇస్మాయిలుద్దీన్ అలీకి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలోనే గత జులై నెల 12న వారిరువురికి వివాహం జరిపించారు. అయితే ఇస్మాయిలుద్దీన్ అలీ మాత్రం తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ షాహిన్‌ను రోజూ హింసించసాగాడు. తన అన్న ఎంతో ఇష్టపడి ఎంగేజ్‌మెంట్ చేసుకున్న యువతిని తనకు ఇచ్చి పెళ్లి చేశారంటూ ఇస్మాయిలుద్దీన్ తీవ్రంగా ఆలోచించేవాడు. అంతేకాక తన అన్నకు భార్యగా ఉండాల్సిన యువతిని తన భార్యగా అంగీకరించలేనంటూ ఆమెను మానసికంగా వేధించినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఇరు కుటుంబాల మద్య ఘర‍్షణ వాతావరణం నెలకొంది. 

ఈ క్రమంలోనే షాహిన్‌కు అత్తమామల నుంచి సైతం వేదింపులు మొదలయ్యాయి. దీనితో తీవ్ర మనస్తాపం చెందిన షాహిన్‌ బేగం గత శనివారం తన గదిలో ఉన్న ఫాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే షాహిన్‌ బేగం మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top