breaking news
home harassment
-
అన్నతో ఎంగేజ్మెంట్, తమ్ముడితో పెళ్లి.. ఆపై ఆత్మహత్య
హైదారాబాద్: పెళ్లయి నెల గడవక ముందే ఓ యువతి జీవితం బలైపోయింది. తన ప్రమేయం లేకుండానే ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములతో ఒకరితో ఎంగేజ్మెంట్, మరొకరితో వివాహం చివరికి ఆ యువతిని బలికొంది. ఇక పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.. పాతబస్తీకి చెందిన షబ్బీర్ అలీ కుమార్తె షాహిన్‌తో జల్పల్లి న్యూ బాబానగర్‌కు చెందిన మీర్ ఇస్మాయిలుద్దీన్ అలీకి గత నెల 12న పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. అయితే మూడు సంవత్సరాల క్రితమే ఇస్మాయిలుద్దీన్ వివాహం చేసుకున్న షాహిన్భేగంకు తన అన్నయ్య జలాలుద్దీన్‌తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన కొన్నాళ్ళకి ఉపాధి నిమిత్తం అన్నదమ్ములిద్దరూ దుబాయికి వెళ్లారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో వివాహం చేసుకునేందుకు జలాలుద్దీన్ దుబాయి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. అయితే కొద్ది రోజుల క్రితమే తన తమ్ముడు ఇస్మాయిలుద్దీన్ అలీ మాత్రం తిరిగి తన స్వస్థలం చేరుకున్నాడు. ఇది ఇలా ఉండగా దుబాయ్‌లో జలాలుద్దీన్ ఆచూకి తెలియని పరిస్థితి కుటుంబ సభ్యులకు ఎదురైంది. దీనితో తప్పని పరిస్తితుల్లో ఇరు కుటుంబాల పెద్దలు చర్చించి షాహిన్‌ను ఇస్మాయిలుద్దీన్ అలీకి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే గత జులై నెల 12న వారిరువురికి వివాహం జరిపించారు. అయితే ఇస్మాయిలుద్దీన్ అలీ మాత్రం తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ షాహిన్‌ను రోజూ హింసించసాగాడు. తన అన్న ఎంతో ఇష్టపడి ఎంగేజ్మెంట్ చేసుకున్న యువతిని తనకు ఇచ్చి పెళ్లి చేశారంటూ ఇస్మాయిలుద్దీన్ తీవ్రంగా ఆలోచించేవాడు. అంతేకాక తన అన్నకు భార్యగా ఉండాల్సిన యువతిని తన భార్యగా అంగీకరించలేనంటూ ఆమెను మానసికంగా వేధించినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఇరు కుటుంబాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే షాహిన్‌కు అత్తమామల నుంచి సైతం వేదింపులు మొదలయ్యాయి. దీనితో తీవ్ర మనస్తాపం చెందిన షాహిన్ బేగం గత శనివారం తన గదిలో ఉన్న ఫాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే షాహిన్ బేగం మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఆ రెండు రకాల అత్యాచారాలూ ఒకలాంటివే
న్యూఢిల్లీ: భర్త చేతిలో అత్యాచారానికి గురై భార్యను కూడా సాధారణ అత్యాచార బాధితురాలి మాదిరిగానే పరిగణించాలని స్థానిక కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. గర్భిణి అయిన భార్యతో అసహజ రతి జరిపిన భర్తకు బెయిల్ తిరస్కరిస్తూ అడిషనల్ సెషన్స్ జడ్జి కామినీలావు పైవ్యాఖ్యలు చేశారు. వైవాహిక జీవితాల్లో అత్యాచారాలకు బలవుతున్న మహిళలు మౌనంగా రోదిస్తున్నా చట్టం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ అత్యాచార బాధితురాలి మాదిరిగానే భర్తల వల్ల ఇబ్బందిపడే మహిళలకూ ప్రభుత్వ సాయమందించాలని అభిప్రాయపడ్డారు. తాను గర్భవతిగా ఉన్నప్పటికీ భర్త మద్యం సేవించి వచ్చి అసహజరతి కోసం ఇబ్బంది పెడుతున్నాడంటూ కేశవపురం మహిళ ఒకరు కోర్టుకు ఫిర్యాదు చేశారు. తొమ్మిదేళ్ల కొడుకుతోనూ శృంగారం గురించి మాట్లాడుతున్న నిందితుడి మానసికస్థితి సరిగ్గా లేనట్టు అర్థమవుతోందని కోర్టు పేర్కొంది. బాధితురాలికి భర్త అయినంత మాత్రాన అతనిపై జాలి చూపడం కుదరదని న్యాయమూర్తి కామిని స్పష్టం చేశారు. తాను భర్తపైనే ఆధారపడ్డందున అతణ్ని విడుదల చేయాలన్న బాధితురాలి విజ్ఞప్తిని తిరస్కరించారు. అత్తింటి వారి ఒత్తిడి మేరకే గర్భంతో ఉన్నా ఆమె స్వయంగా కోర్టుకు వచ్చి విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నారు. ఈ కేసులో స్థానిక పోలీసుల దర్యాప్త సరిగ్గా లేదంటూ అక్కడి డీసీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసు నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి చర్యల కోసం బాధితురాలి ఆర్థిక, మానసికస్థితిని అంచనా వేసి నివేదిక సమర్పించాలని స్థానిక జాయింట్ కమిషనర్‌ను ఆదేశించారు. దీని ప్రతిని నగర కమిషనర్‌కూ పంపించాలన్నారు.