నిర్లక్ష్యమే నిండుప్రాణాలను బలితీసుకుంది

Negligence Has Claimed In Wall Collapse Incident Chandrayangutta - Sakshi

చాంద్రాయణగుట్ట: ఓ వెంచర్‌ నిర్వాహకుడి నిర్లక్ష్యమే చాంద్రాయణగుట్టలో ఎనిమిది అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్‌ మజీద్‌ తెలిపిన మేరకు.. బండ్లగూడ గౌస్‌నగర్‌లో మహ్మద్‌ హిల్స్‌ వెంచర్‌ పేరుతో మహ్మద్‌ పహిల్వాన్‌ కుటుంబ సభ్యులు వెంచర్‌ను చేస్తున్నారు. ఎత్తైన ప్రదేశంలో గుట్టపై ఉన్న ఈ వెంచర్‌కు ఇటీవలే భారీగా ప్రహారీ నిర్మించారు. కాగా ఈ ప్రహారీని ఎలాంటి పునాది లేకుండా బండరాళ్ల పైనే సిమెంట్‌ వేసి గ్రానైట్‌తో పైకి లేపారు. అనంతరం మట్టితో చదును చేశారు. అయితే ఇటీవల కురుస్తున్న భారీ వర్షానికి మట్టి కూరుకుపోవడంతో పాటు పునాది లేకపోవడంతో ప్రహారీ కూడా పట్టుతప్పి మంగళవారం రాత్రి  ఒక్కసారిగా సగం మేర  కూలి దిగువన ఉన్న రేకుల ఇళ్లపై పడింది. ఐదారు ఇళ్లపై గ్రానైట్‌లు పడినప్పటికీ....కేవలం రెండిళ్లపై ప్రభావం ఎక్కువగా చూపి అందులో ఉన్న ఉన్న ఎనిమిది మంది  ప్రాణాలు పోయాయి.   

ఒకే ఇంట్లో ఐదుగురి మృతి.. 
గౌస్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ జహంగీర్‌ తన ఇద్దరు కుమారులు, కుమార్తెలు, కోడళ్లు, పిల్లలతో సంతోషంగా మంగళవారం రాత్రి నిద్రించాడు. నిద్రించిన కాసేపటికే భారీ శబ్దాలు రావడంతో చిన్న కుమారుడు మహ్మద్‌ నవాజ్‌ అఖ్నీ వెంటనే బయటికి పరుగులు తీశాడు. ఇంట్లో ఉన్న జహంగీర్‌ కుమారుడు పెద్ద కుమారుడు సమద్‌ రబ్బానీ (35), కోడలు సబా హాష్మీ(26), రెండో కుమార్తె ఫౌజియా నాజ్‌ (36), ఆమె కుమారులు సయ్యద్‌ జైన్‌((3), జొయేద్‌ (19 రోజులు)లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో కుమార్తె సబియా అనాజ్‌ (31) తీవ్రంగా గాయపడింది.  ఇలా ఒకే ఇంట్లో మొత్తం ఐదు మంది మృతి చెందారు. తల్లి, సంతానాన్ని కోల్పోయిన సిద్దిఖీ  జహంగీర్‌ ఇంటిని ఆనుకునే సిద్దిఖీ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంటిపై కూడా ఇదే మాదిరిగా గోడ కూలడంతో సిద్దిఖీ తల్లి జాకీ రా బేగం (50), కుమారుడు సయ్యద్‌ సాదిక్‌ (1), కుమార్తె సయ్యదా అన్వారీ (3)మృతి చెందారు.  

గౌస్‌నగర్‌లో విషాధచాయలు  
గౌస్‌నగర్‌లో పక్కపక్కింట్లోనే నివాసం ఉండే ఎనిమిది మంది మృత్యువాత పడడంతో స్థానికంగా తీవ్ర విషాధ ఛాయలు అలుముకున్నాయి. రాత్రి వర్షం కారణంగా రాలేకపోయిన బంధుమిత్రులు బుధవారం ఉదయమే పెద్ద ఎత్తున ఇళ్లకు చేరుకున్నారు. అనంతరం మృతదేహాలు రాకపోవడంతో పోస్టుమార్టం చేస్తున్న ఉస్మానియా ఆసుపత్రికి బయల్దేరారు.  

నీటిలో కలిసిన ప్రాణాలు 
భారీ వర్షంతో నగరం అతలాకుతలమైంది. జలం మధ్యలో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని జనం విలవిల్లాడారు. వరద నీటి సమస్యనుంచి బయటపడే ప్రయత్నంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. 

విద్యుదాఘాతంతో కార్పెంటర్‌ మృతి 
నాగోలు:   కాసోజు నారాయణ చారి (35) ఎల్‌బీనగర్‌ బైరామల్‌గూడ కేకే గార్డెన్‌ సాగర్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీలో నివాసముంటూ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు.  మంగళవారం కురిసిన భారీ వర్షంతో సాగర్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీలో వరద నీరు వచ్చింది. ఇంట్లో స్విచ్‌ ఆఫ్‌ చేయడానికి ప్రయత్నం చేయగా షార్ట్‌ సర్క్యూట్‌తో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా మంగళవారం రాత్రి మృతి చెందాడు. 
 
సెల్లార్‌ నీటిలో మునిగి చిన్నారి.. 
చంపాపేట: రమావత్‌ జితేంద్ర, లక్ష్మి దంపతులు సరూర్‌నగర్‌  పీఅండ్‌టీ కాలనీలోని సాహితీ నెస్ట్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. వీరికి అర్జిత్‌సాయి (3) అనే కుమారుడున్నాడు. భారీవర్షానికి అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో వరదనీరు చేరింది. బుధవారం ఉదయం ఆడుకుంటూ సెల్లార్‌లోకి వెళ్ళిన అర్జిత్‌సాయి నీటిలోకి ప్రమాదవశాత్తు జారిపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అర్జిత్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందాడని వైద్యులు తెలిపారు. 

వరదలో కొట్టుకుపోయి మహిళ  
పహాడీషరీఫ్‌:  మణికొండ ప్రాంతానికి చెందిన నర్సింగ్‌ రావు భార్య వరలక్ష్మి (32) గోషామహాల్‌లో జలమండలి కార్యాలయంలో స్వీపర్‌గా పని చేస్తుంది. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో  సోదరుడు జోగు శంకర్‌ వెంట బైక్‌పై ఆదిబట్ల నుంచి శంషాబాద్‌ వైపు ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డులో వెళుతున్నారు. ఫ్యాబ్‌సిటీ సరస్సు నిండటంతో నీటి ప్రవాహంలో అదుపుతప్పారు. శంకర్‌ బయటికి వచ్చినా వరలక్ష్మి రాలేకపోయింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం రాత్రి 7 గంటలకు మృతదేహం లభించిందని పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి తెలిపారు. 
 
సెల్లార్‌లో నీటిని తోడుతూ.. 
అంబర్‌పే:   బాగ్‌ అంబర్‌పేట వినాయక్‌నగర్‌లో మహాలక్ష్మి అపార్టుమెంట్‌ సెల్లార్‌లో నీరు చేరడంతో  చంద్రమౌళి కుమారుడు రాజ్‌కుమార్‌(33) మోటార్‌ బుధవారం మోటార్‌ బిగిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడని  అంబర్‌పేట  పోలీసులు తెలిపారు. 
 
సెల్లార్‌లో షాక్‌.. ప్రైవేట్‌ ఉద్యోగి మృతి 
అమీర్‌పేట: గంటా శ్రీనివాస్‌ (47) ధరం కరం రోడ్డులో నివాసం ఉంటున్నాడు.  ఐసీఐసీఐ బ్యాంకు వెనకాల సెల్లార్‌లో ఉన్న గోల్డెన్‌ కేఫ్‌ బార్‌ ఆండ్‌ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 10.30 గంటల సమయంలో వరదనీరు రెస్టారెంట్‌లోకి వచ్చిన సమయంలో క్యాషియర్‌ శ్రీనివాస్‌తో పాటు, మేనేజర్‌ సుబ్బారెడ్డి, మరో బాయ్‌లో లోపలే ఉన్నారు. కరెంటు పోవడంతో జనరేటర్‌ ఆన్‌చేశారు. తరువాత కరెంటు రావడంతో నీటిలో విద్యుత్‌ ప్రవహించింది. వరద నీటిలో ఉన్న షాక్‌ తగిలి పడిపోయాడు. అక్కడే ఉన్న మేనేజర్, బాయ్‌ పోలీసులకు సమాచారం అందించారు. విద్యుత్‌వైర్లు బయటకు రావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.  ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
నీటిని పంపింగ్‌ చేస్తూ వైద్యుడు.. 
బంజారాహిల్స్‌: డాక్టర్‌ చల్లా సతీష్‌కుమార్ ‌రెడ్డి (49) యోగా, ఫిజియోథెరపి, నేచురోపతి స్పెషలిస్ట్‌గా శ్రీనగర్‌కాలనీలోని ఎస్‌బీహెచ్‌ కాలనీలో సేవలందిస్తున్నాడు. సతీష్‌కుమార్‌రెడ్డి ఇంటి సెల్లార్‌లోకి భారీగా వరద నీరు చేరింది. బుధవారం ఉదయం నీటిని బయటికి పంపింగ్‌ చేసేందుకు ఆయన మెట్లు దిగి మోటార్‌ ఆన్‌ చేసేందుకు ప్రయత్నించగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. బంజారాహిల్స్‌ పోలీసులు విచారణ చేపట్టారు.   
 
భయంతో గుండెపోటు..వృద్ధురాలి మృతి 

బడంగ్‌పేట్‌: బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సాయిబాలాజీ టౌన్‌షిప్‌ కాలనీమొత్తం ముంపునకు గురైంది. మంగళవారం రాత్రి ఇంటిలోకి వరదనీరు రావడంతో భయాందోళనకు గురైన రామసహాయం రత్నమాల(65), గుండెపోటుతో చనిపోయింది. అర్ధరాత్రి కాలనీ మొత్తం జలమయం కావడంతో ఆసుపత్రికి తరలించే పరిస్థితి లేకపోవడంతో రాత్రి మొత్తం ఇతర కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటు గడిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top