నర్సింగ్‌ విద్యార్థిని రవళి మృతి

Narsing Student Ravali Died In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రోహిణి నర్సింగ్‌ కళాశాల విద్యార్థిని కాందారపు రవళి(20) రెండు రోజులుగా రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచింది. సుబేదారి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం, గోపాల్‌పూర్‌కు చెందిన కాందారపు తిరుపతి, రజిత దంపతుల పెద్ద కూతురు కందారపు రవళి హంటర్‌రోడ్డులోని రోహిణి నర్సింగ్‌ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్‌ మూడో సంవత్సరం చదువుతుంది.

ఈనెల 7న రాత్రి 10.30 గంటల సమయంలో హాస్టల్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి విద్యార్థినులు, యాజమాన్యం రోహిణి ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి 1.30 సమయంలో తుదిశ్వాస విడిచింది. మృతదేహాన్ని ఎంజీఎంకు పంపించి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ తెలిపారు. విచారణ అనంతరం ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 

తల్లిదండ్రుల గోడు పట్టించుకోరా..?
రవళి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు రోహిణి కళాశాల యాజమాన్యం తెలియజేయకుండా రవళి స్నేహితులు తెలియజేశారు. ఆ తరువాత రోహిణి ఆస్పత్రి వద్ద విద్యార్థి సంఘాల ఆందోళనతో రవళిని చూడటానికి తల్లిదండ్రులకు అనుమతించారు. రవళి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని చేరవేసిన తోటి విద్యార్థినులను తల్లిదండ్రులకు కలువనివ్వలేదు, ఆ విద్యార్థినులపై యాజమాన్యం బెదిరింపులకు పాల్పడి అడ్డుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆదివారం అర్ధరాత్రి రవళి మృతిచెందిన విషయం కూడా యాజమాన్యం మృతదేహాన్ని ఎంజీఎం పంపడానికి అన్ని సిద్ధం చేసుకున్నాకే తెలియజేసినట్లు తెలిసింది. ఈ సంఘటనల నేపథ్యంలో రవళి మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. తల్లిదండ్రులు తమ గోడును యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థి సంఘాల ఎదుట విలపించినట్లు తెలిసింది. 

పోలీసులతో వాగ్వాదం..
నర్సింగ్‌ విద్యార్థిని రవళి మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ఉదయం పలు విద్యార్థి సంఘాల నేతలు రోహిణి ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో సుబేదారి పోలీసులకు విద్యార్థి సంఘాల నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు యాజమాన్యానికి బాసటగా నిలిచి మృతురాలి కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని వివిధ సంఘాల నేతలు ఆరోపించారు.

మృతదేహాన్ని అర్ధరాత్రి ఎంజీఎంకు ఎందుకు పంపించారని వారు ప్రశ్నించారు. గోపాల్‌పూర్‌ గ్రామ సర్పంచిని అడ్డుగా పెట్టుకుని యాజమాన్యం తల్లిదండ్రులకు తీరని అన్యాయం చేశారని, ఈ సంఘటనపై అన్ని సంఘాలు ఐక్యంగా ఉండి రవళి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఆందోళన చేసిన వారిలో విద్యార్థి సంఘాల నేతలు తిరపతియాదవ్, కన్నం సునిల్, మేడ రంజిత్, కాడపాక రాజేందర్, వినోద్‌ లోక్‌నాయక్, ఎండీ పాషా, ఏకు ప్రవీణ్, నరేష్, దుప్పటి సుభాష్, రాకేష్‌ పాల్గొన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top