పోలీసు కస్టడీకి అభిషేక్, అనిల్‌ 

Nampally Court Allowed Abhishek And Anil To Police Custody - Sakshi

నాలుగు రోజులపాటు అనుమతించిన కోర్టు  

నేడు ఉత్తర్వులు వెలువరించనున్న న్యాయస్థానం 

సాక్షి, హైదరాబాద్‌: పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ రేవ్‌ పార్టీ కేసులో నిందితులుగా ఉన్న మేనేజర్‌ అనిల్‌కుమార్, భాగస్వామి అభిషేక్‌లను నాలుగురోజుల పోలీసు కస్టడీకి అప్పగించడానికి నాంపల్లి కోర్టు సోమవారం అనుమతించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం వెలువడే అవకాశముంది. పబ్‌లో దొరికిన కొకైన్‌ ఎక్కడ నుంచి వచ్చిందనేది గుర్తించడం వీరి విచారణలో కీలకం కానుంది. రేవ్‌ పార్టీలో మూడు టేబుళ్లపై జరిగిన వ్యవహారం అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని అభిషేక్‌ ఆదేశాల మేరకు అనిల్‌కుమార్‌ చాలాసేపటి వరకు బ్లాక్‌ చేసి ఉంచినట్లు పోలీసులు తెలుసుకున్నారు.

రాత్రి 12.30 గంటల ప్రాంతంలో 15 నుంచి 20 మంది వచ్చారని, వారిని లోపలికి తీసుకురావడానికి అనిల్‌ స్వయంగా పబ్‌ ప్రధానద్వారం వరకు వెళ్లారని ఓ ఉద్యోగి బయటపెట్టాడు. పబ్‌లో ఉన్న ఉద్యోగుల్లో ఇద్దరు మాత్రమే ఆ టేబుళ్లకు సర్వ్‌ చేశారని, మిగిలిన వాళ్లను దరిదాపులకు కూడా అనిల్‌కుమార్‌ రానీయలేదని వివరించాడు. కాగా, అనిల్, అభిషేక్‌ల విచారణలో డ్రగ్స్‌ సరఫరాదారులతోపాటు వాటిని వినియోగించిన వారి వివరాలను పోలీసులు సేకరించే అవకాశముంది. ఆపై వీరి వాంగ్మూలాల ఆధారంగా 128 మంది వినియోగదారుల్లో ఈ డ్రగ్స్‌ వాడిన వారి నుంచి నమూనాలు సేకరించడానికి అనుమతి కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న అర్జున్‌ వీరమాచినేని ఆచూకీకి సంబంధించిన సమాచారాన్ని వీరి నుంచి సేకరించాలని పోలీసులు యోచిస్తున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top