రూ. 1.5 లక్షలు తిరిగి ఇవ్వమన్నందుకు గర్ల్‌ఫ్రెండ్‌ హత్య

Mumbai Man Murders Girlfriend Dumps Her Body At Church After She Repays Her Loan - Sakshi

ముంబైలో చోటు చేసుకున్న దారుణం

ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో విషాదం చోటు చేసుకుంది. తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయమన్నందుకు గర్ల్‌ఫ్రెండ్‌ని దారుణంగా హత్య చేసి.. ఓ చర్చి సమీపంలోని చెత్త కుప్పలో పడేశాడు నిందితుడు. మృతురాలిని కుషిత పుంజార్‌గా గుర్తించారు పోలీసులు. ఆ వివరాలు.. జార్ఖండ్‌కు చెందిన బిపిన్‌ కందులూనా, ముంబైకి చెందిన కుషిత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో కుషిత గతంలో బిపిన్‌కు 1.5లక్షల రూపాయలు ఇచ్చింది. కొంతకాలం బాగానే సాగిన వీరి బంధంలో కొద్ది రోజులుగా గొడవలు మొదలయ్యాయి. తనను వివాహం చేసుకోవాల్సిందిగా కుషిత, బిపిన్‌ మీద ఒత్తిడి తీసుకువచ్చింది. ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేని బిపిన్‌ ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని దాటవేస్తూ వచ్చాడు. 

బిపిన్‌కు తనను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అర్థం చేసుకున్న కుషిత.. గతంలో తాను అతడికి ఇచ్చిన 1.5లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్‌ చేసింది. అంతేకాక తనను మోసం చేసినందుకుగాను అతడిపై అత్యాచారం కేసు పెడతానని బెదిరించసాగింది. ఈ క్రమంలో కుషిత మీద కోపం పెంచుకున్న బిపిన్‌ ఆమెను అవమానించడమే కాక దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని బాంద్రాలోని మౌంట్ మేరీ చ‌ర్చ్ స‌మీపంలో ప‌డ‌వేశాడు. 

హత్య చేసిన తర్వాత బిపిన్‌ సొంత రాష్ట్రం పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు బిపిన్‌ కోసం గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు. 

చదవండి: పెళ్లి చేసుకుందాం.. ప్రియురాలిని హతమార్చిన ప్రియుడు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top