ముల్తానీల్లో మార్పు వచ్చేనా..? | Multani Group Gang Attacks In Adilabad | Sakshi
Sakshi News home page

ముల్తానీల్లో మార్పు వచ్చేనా..?

Nov 10 2021 9:19 AM | Updated on Nov 10 2021 1:36 PM

Multani Group Gang Attacks In Adilabad - Sakshi

సాక్షి, ఇచ్చోడ (ఆదిలాబాద్‌): ఈసారైనా ముల్తానీల మార్పు సాధ్యపడేనా.? వారి మార్పు కోసం జిల్లా అధికార యంత్రాంగం తీసుకునే నిర్ణయాలు ఏకీభవించి వాటికి అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తారా.? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. నేర ప్రవృత్తిలో కరుడుగట్టిన ముల్తానీలు పరస్పర దాడులు, పోలీసు కేసులకు బయపడే రకం కాదు. గుండాల, కేశవపట్నం, జోగిపేట్‌ గ్రామాల్లో నివసిస్తున్న ముల్తానీలపై 20ఏళ్లుగా 2వేలకు పైగా మందిపై జిల్లాలో వివిధ పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

కానీ ఇటీవల గుండాలలో ఉర్సు ఉత్సవాల్లో రెండు గ్రూపుల మధ్య జరిగిన దాడిలో ఇద్దరు దారుణ హత్యకు గురి కాగా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనతో జిల్లా పోలీసు యంత్రాంగం అలర్ట్‌ అయింది. ముల్తానీల గ్రామాల్లో దాడులు పునరావృతం కాకుండా పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్, జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ రాజేశ్‌చంద్ర గుండాల గ్రామ ప్రజలతో రెండు, మూడు సార్లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. ముల్తానీల్లో మార్పునకు తీసుకోవాల్సిన చర్యలపై మండల స్థాయి అధికారులతో ఓ టీంను ఏర్పాటు చేశారు. 

ఫలించని కృషి
ముల్తానీల మార్పునకు గతంలో జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకున్నప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. కలప స్మగ్లింగ్‌ చేస్తున్న వారికి మైనార్టీ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులతో పాటుగా బ్యాంకు అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి ముల్తానీల గ్రామాల్లో పర్యటించి ప్రణాళిక తయారు చేసి అప్పటి కలెక్టర్‌కు అందజేశారు. కానీ పూర్తిస్థాయిలో ముల్తానీలకు స్వయం ఉపాధి కల్పించకపోవడంతో అధికారులు చేసిన కృషి ఫలించ లేదు. ప్రస్తుతం కలెక్టర్‌ సిక్తా పట్నాయక్, జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ రాజేశ్‌చంద్ర మండల స్థాయి అధికారులతో టీంను ఏర్పాటు చేశారు. ఈ టీం ఆ గ్రామాల్లో పర్యటించి వారి మార్పునకు ప్రణాళిక సిద్ధం చేయనుంది.

గుండాల్లో నాలుగుసార్లు దాడులు...
గుండాల గ్రామంలో ఐదేళ్ల కాలంలో నాలుగు సార్లు దాడులు జరిగాయి. చిన్నచిన్న దాడులు తరుచుగా జరుగుతూనే ఉంటాయి. నాలుగుసార్లు కత్తులు, రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయాల పాలై చావు అంచుల వరకు వెళ్లి వచ్చినవారు ఉన్నారు. ఈ దాడులన్నీ ఉర్సు ఉత్సవాల సమయంలోనివే. ఇటీవల జరిగిన దాడిలో ఓ గ్రూపునకు చెందిన  ఇద్దరు హత్యకు గురి కాగా జిల్లా అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. 

కేసులంటే బయం లేదు..
గతం నుంచి నేరప్రవృత్తి కలిగిన ముల్తానీలకు పోలీసు కేసులంటే అసలు బయమేలేదు. గుండాల, కేశవపట్నం, జోగిపేట్, ఎల్లమ్మగూడ గ్రామాల్లో 9వేల వరకు వీరి జనాభా ఉంది. వీరిలో 20నుంచి 60ఏళ్ల లోపుగల 2వేల మందిపై కేసులు ఉన్నాయి.

అక్షరాస్యత లేక...
ముల్తానీలు మార్పు చెందకపోవడానికి ప్రధాన కారణం నిరక్షరాస్యతే.  వీరిలో పదో తరగతి వరకు చదుకున్న వారు పదుల సంఖ్యలోనే ఉంటారు.  నాలుగైదు తరగతి చదివిన తరువాత బడిని మాన్పిస్తారు. ఒక్కో కుంటుంబంలో కనీసం 5నుంచి 12 మంది వరకు పిల్లలు ఉంటారు. ముల్తానీ మహిళలు కుటుంబ నియంత్రణ చేసుకునేందుకు      ముందుకు రావడం లేదు.

మార్పునకు తీసుకోవాల్సిన అంశాలు...

► ముల్తానీల మార్పు కోసం జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. 
 బడీడు పిల్లలకు నిర్బంధ విద్యను అందించాలి.
 ప్రాథమిక విద్య అనంతరం పై చదువుల కోసం వారిని మైనార్టీ గురుకుల పాఠశాలలో చేర్పించాలి. 
  పాఠశాలకు పిల్లలను పంపని వారి తల్లితండ్రులకు ప్రభుత్వ పథకాలు నిలిపివేయాలి.
  కుటుంబ నియంత్రణ తప్పనిసరిగా పాటించేలా అవగాహన కల్పించాలి.
 నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ ఇప్పించి బ్యాంకుల ద్వారా రుణాలు అందజేసి ఉపాధి కల్పించాలి.
 అర్హులకు వృద్ధాప్య, వితంతువు పింఛన్లు ఇప్పించాలి. 
  పోలీసు కేసులతో కోర్టుల చుట్టు తిరిగడం వల్ల కలిగే ఇబ్బందులు తెలియజేయాలి. 

వలస వచ్చి నివాసం..
పాకిస్తాన్‌ను నుంచి సుమారు 160 ఏళ్ల క్రితం వలస వచ్చిన ముస్లిం గిరిజన తెగకు చెందిన ముల్తానీలు ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండాల, కేశవపట్నం, జోగిపేట్‌ గ్రా మాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దేశ విభజన తర్వాత వీరు తిరిగిఅక్కడికి వెళ్లిపోకుండా ఇక్కడే ఉండిపోయారు. కలప అక్రమ రవాణాను ఉపాధిగా మార్చుకుని జీవించేవారు. రాష్ట్ర ప్రభుత్వం కలప స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపడంతో నాలుగేళ్ల నుంచి కలప స్మగ్లింగ్‌ తగ్గుముఖం పట్టింది. దీంతో వీరిలో కొంతమంది వ్యవసాయం,  మరికొంత మంది చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement