
విజయవాడ: లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో జూడో స్పోర్ట్స్ కోచ్ శ్యామ్యూల్స్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .తమను లైంగికంగా వేధించాడంటూ పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో శ్యామ్యూల్స్ రాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
మద్యం మత్తులో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణపై కేసు నమోదైంది. తమపై బెదిరింపు చర్యలకు కూడా దిగాడని విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరికైనా చెబితే జీవితం నాశనం చేస్తానని తమను కోచ్ శ్యామ్యూల్స్ రాజు బెదిరించినట్లు విద్యార్థులు ఫిర్యాదు చేశారు.
జూడో నేషనల్ మ్యాచ్‌లో భాగంగా చెన్నైకు వెళుతున్న క్రమంలోనే కోచ్ వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. మెడికల్ టెస్టుల కోసం విజయవాడలో ఆగగా ట్రైన్ మిస్ అయిన క్రమంలో స్టేట్ జూడో ఇన్సిస్ట్యూట్‌కు తీసుకువెళ్లి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం.