Meerpet: ‘ఠాగూర్‌’ను తలపించే సీన్‌.. అస్సలు తగ్గేదే లే!

meerpet: Wife Alleges Husband Died Due To Doctors Negligence - Sakshi

బ్లాక్‌లో రెమ్‌డెసివర్‌.. వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి

రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లు బ్లాక్‌లో కొనిపించిన ఆయస్పత్రి యాజమాన్యం

ఇతరులకు అమ్ముకున్నారని తెలిపిన బాధితులు

వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భర్త మృతి చెందాడని ఫిర్యాదు

రైజ్‌ ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు 

సాక్షి, మీర్‌పేట: వైద్యం పేరుతో మోసం చేసి తన భర్త మృతికి కారణమయ్యారని మృతుడి భార్య మీర్‌పేట పోలీసులకు రైజ్‌ చిల్డ్రన్స్‌ ఆసుపత్రి యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపేట హుడాకాంప్లెక్స్‌కు చెందిన పాశం సైదులు గౌడ్‌ ఏప్రిల్‌ 26వ తేదీన కరోనా బారిన పడి హస్తినాపురంలోని రైజ్‌ చిల్డ్రన్స్‌ ఆసుపత్రిలో చేరాడు. సైదులు పరిస్థితి విషమంగా ఉందని.. హెల్త్‌కార్డు తీసుకోమని రూ.50వేలు నగదు రూపంలో చెల్లిస్తేనే చేర్చుకుంటామని చెప్పడంతో ముందుగా రూ.50వేలు చెల్లించి ఆ తరువాత బెడ్‌ కోసం ప్రతి రోజు రూ.40వేలు, మాత్రలు, పరీక్షలకు వేర్వేరుగా నగదు చెల్లించారు. 

మరుసటి రోజు వైద్యులు 6 రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లు అవసరమని.. రూ.30వేలకు బ్లాక్‌ మార్కెట్లో శంకర్‌ అనే వ్యక్తి వద్ద దొరుకుతాయని చెప్పి ఇంజెక్షన్లు ఇప్పించారని తెలిపారు. ఇదిలా ఉండగా సైదులుకు ప్లాస్మా కావాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు రూ.20వేలు చెల్లించారు. ఏప్రిల్‌ 30వ తేదీన మరికొన్ని పరీక్షలు నిర్వహించాలని అందుకు రూ.60వేలు ఖర్చవుతుందని చెప్పి నగదు చెల్లించాక 14 గంటల తరువాత సైదులు పరిస్థితి విషమించిందని తెలిపారన్నారు. వెంటిలేటర్‌ అత్యవసరమని లక్ష రూపాయలు చెల్లించాలని తెలిపారు. మే 2వ తేదీన సైదులుకు నాలుగు యూనిట్ల ప్లాస్మా, మందులు అవసరమని, చెప్పి ఐదు రోజుల్లో కోలుకుంటాడని వైద్యులు చెప్పారు. అనంతరం మే 8వ తేదీన సైదులు మృతి చెందాడు. 

వైద్యం పేరుతో రైజ్‌ ఆసుపత్రి యాజమాన్యం లక్షల్లో డబ్బు వసూలు చేసి, రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లు తన భర్తకు వేయకుండా ఇతరులకు అమ్ముకున్నారని మృతుడి భార్య పేర్కొన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన భర్త మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లు అమ్ముకున్న మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డితో పాటు వైద్యులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రఘుదీప్, మనోహర్‌రెడ్డి, డైరెక్టర్‌ శిల్పపై చీటింగ్‌ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top