మాజీ సర్పంచ్‌ను కిడ్నాప్‌ చేసిన మావోలు..ఏజెన్సీలో ఉత్కంఠ

Maoists Kidnap Former Sarpanch In Mulugu District - Sakshi

ఏజెన్సీలో అలర్ట్‌... ఆరాతీస్తున్న పోలీసులు     

ఏటూరునాగారం/వెంకటాపురం (కె): మాజీ సర్పంచ్, ప్రస్తుతం డ్రైవర్‌ వృత్తి చేసుకుంటున్న కురుసం రమేశ్‌ను మావోయిస్టులు సోమవారం రాత్రి ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం సూరువీడు పంచాయతీ కె కొండాపురం వద్ద కిడ్నాప్‌ చేసినట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపారు. సూరువీడు ప్రాంతానికి చెందిన రమేశ్‌ 2014లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి సర్పంచ్‌గా గెలిచారు. ఆ తర్వాత రమేశ్‌ భార్య రజితకు ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో ఏఎన్‌ఎం ఉద్యోగం రావడంతో ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్వార్టర్స్‌ సమీపంలో నివాసం ఉంటున్నారు.

రమేశ్‌ వృత్తిరీత్యా డ్రైవర్‌ కావడంతో ఖాళీ సమయంలో ఎవరికైనా యాక్టింగ్‌ డ్రైవర్‌గా వెళ్లేవాడు. ఇదే క్రమంలో సోమవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు పోయే పని ఉందని ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత 24 గంటలు దాటినా రమేశ్‌ ఇంటికి రాకపోవడంతో ఆరా తీయగా, కొందరు ముఖానికి ముసుగులు కట్టుకొని రమేశ్‌ను వేరే వాహనంలో తీసుకెళ్లినట్లు అక్కడి స్థానికులు తెలిపారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

దీంతో ఏజెన్సీలో ఉత్కంఠ నెలకొంది. మావోయిస్టులు కిడ్నాప్‌ చేయడంతో ఆయన పరిస్థితి ఎలా ఉందోనని కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటు పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో అలర్ట్‌ చేసి.. రమేశ్‌ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.  


భర్తను విడిచిపెట్టాలని వేడుకుంటున్న రమేశ్‌ భార్య రజిత, పిల్లలు 

అన్నలూ.. నా భర్తను విడిచి పెట్టండి.. 
రమేశ్‌ భార్య రజిత మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని, మా కుటుంబానికి అన్యాయం చేయొద్దని మావోయిస్టులను కోరారు. ‘ఏదైనా తప్పుచేస్తే నాలుగు దెబ్బలు కొట్టి ఇంటికి పంపించండి. మాకు ఇద్దరు పిల్లలు, నేను ఆగమైపోతా.

మీ తోడబుట్టిన దానిని అనుకొని నా భర్తను విడిచి పెట్టండి. నా కుటుంబానికి నా భర్తే పెద్ద దిక్కు. అన్నలూ.. దండం పెడుతున్నా.. ఆయనకు ఏదైనా హాని తలపెడితే మేం బతకం’అంటూ మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. అలాగే రమేశ్‌ తల్లి మంగమ్మ కూడా కొడుకును విడుదల చేయాలని కోరారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top