ముగ్గురన్నలకు ప్రభుత్వ ఉద్యోగం.. తనకు మాత్రం.. | Man Self Distruction In Adilabad | Sakshi
Sakshi News home page

ముగ్గురన్నలకు ప్రభుత్వ ఉద్యోగం.. తనకు మాత్రం..

Aug 13 2021 3:03 PM | Updated on Aug 13 2021 3:08 PM

Man Self Distruction In Adilabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, దండేపల్లి(ఆదిలాబాద్‌): ముగ్గురు అన్నయ్యలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు.. తనకు ఏ ఉద్యోగం రావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రైనీ ఎస్సై శివకుమార్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. దండేపల్లి మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన భూక్య శంకర్‌నాయక్‌కు నలుగురు కుమారులు. అందులో పెద్దవారు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్న కొడుకు నరేశ్‌(26) డిగ్రీ వరకు చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇంటి వద్దనే ఉంటూ తండ్రితోపాటు వ్యవసాయ పనులకు వెళ్తున్నాడు.

‘అన్నయ్యలకు ఉద్యోగాలు వచ్చాయి. వాళ్లు మంచిగా బతుకుతున్నారు. నాకే రాకపాయే, నేను ఎలా బతుకుడో’ అని అప్పుడప్పుడు తల్లిదండ్రులతో చెప్పుకుంటూ బాధపడేవాడు. ఈనెల 21న అతనికి పెళ్లి నిశ్చయించారు. దీంతో భవిష్యత్‌పై మరింత ఆందోళనకు గురైన నరేశ్‌ ఈనెల 9న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తండ్రి శంకర్‌నాయక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ట్రైనీ ఎస్సై వెల్లడించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement