చిట్టీల పేరుతో రూ.4కోట్లకు టోకరా!

A Man Cheat Four Crore And Escape In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ సెంట్రల్‌: ఇంటి చుట్టుపక్కల వారితో ఎంతో నమ్మకంగా ఉంటూ చిట్టీల పేరుతో సుమారు రూ. 4కోట్ల వరకు వసూళ్లు చేసిన ఓ వ్యక్తి కుటుంబంతో సహా ఉడాయించిన ఘటన సత్యనారాయణపురం శ్రీనగర్‌కాలనీలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. శనగల బాలాజీరావు అనే వ్యక్తి చిట్టీలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటూ భార్య, ఇద్దరు కొడుకులతో కలసి శ్రీనగర్‌కాలనీ మొదటి లైన్‌లో సొంత ఇంట్లో ఉంటున్నారు. గత పదిహేనేళ్లుగా ఇంటి చుట్టుపక్కల వారితో నమ్మకంగా చిట్టీలు కట్టించుకోవడం, వడ్డీకి అప్పులు తీసుకుంటూ సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉండేవాడు.

దీంతో అతనిపై నమ్మకం కలగటంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అతని వద్ద చిట్టీలు వేయడంతో పాటు పెద్ద మొత్తంలో వడ్డీకి అప్పులు ఇచ్చేవారు. ఈ క్రమంలో గత లాక్‌డౌన్‌ నుంచి చిట్టీలు పూర్తయిన వారికి, అప్పులు ఇచ్చిన వారికి చెల్లింపులు చేయకుండా.. రేపు, మాపు అంటు కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో బాధితులు అతనిపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో బాలాజీరావు గుట్టుచప్పుడు కాకుండా తన ఇంటిని అమ్మివేసి ఈ నెల 16వ తేదీ రాత్రి కుటుంబంతో సహా అదృశ్యమయ్యాడు.  
బాధితుల ఆందోళన.. 
విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు సుమారు 20 మంది మంగళవారం బాలాజీరావు ఇంటి ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎన్‌పురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు హామీ ఇవ్వడంతో వారంతా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు సుమారు 50 మంది ఫిర్యాదు చేయగా.. ఒక్కొక్కరి నుంచి రూ. లక్ష నుంచి రూ. 30 లక్షల వరకు నగదు తీసుకోవడంతో పాటు చిట్టీలు పూర్తయిన వారికి రావాల్సిన బకాయిలు మొత్తం సుమారు రూ. 4కోట్ల వరకు ఉంటుందని బాధితులు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలమురళీకృష్ణ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top