Extra Marital Affair: స్నేహితుడి ప్రియురాలితో సానిహిత్యం.. ఏడాది తర్వాత!

Man Assassinated Friend Over Extra marital Affair  - Sakshi

సాక్షి, చిత్తూరు : వివాహేతర సంబంధం కారణంగా స్నేహితుడినే హత్య చేసి చెరువులో పాతి పెట్టాడు. ఈ హత్య కేసు మిస్టరీని  పోలీసులు ఏడాది తరువాత ఛేదించి, నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా వి.కోట సీఐ ప్రసాద్‌బాబు కథనం మేరకు పట్టణ పరిధిలోని ముదిమడుగుకు చెందిన షరీఫ్‌ కుమారుడు ఇస్మాయిల్‌(23) ఎలక్ట్రీషియన్‌. ఇతనికి వి.కోట పట్టణంలోని నారాయణనగర్‌కు చెందిన నరేష్‌ స్నేహితుడు. ఇలా వీరి స్నేహం మొదలైన ఏడాదిన్నర తరువాత ఇస్మాయిల్‌ బెంగుళూరుకెళ్లి, బంధువుల ఇంటిలో ఉంటూ అక్కడే పనిచేసుకుంటున్నాడు.

ఈ క్రమంలో నరేష్‌  అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో నరేష్‌ ఇంటి వాళ్లు గొడవ చేయగా ఆ మహిళతోనే ఉండిపోయాడు. ఈ సమయంలో అప్పుడప్పుడు స్నేహితుడి వద్దకు వచ్చిపోతున్న ఇస్మాయిల్, నరేష్‌ ప్రియురాలితో సన్నిహితంగా మెలిగేవాడు. నరేష్‌ లేని సమయంలో ఆమె ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. దీన్ని గమనించిన నరేష్‌ ఇస్మాయిల్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బు చెల్లించాలని 05–01–2021న ఇస్మాయిల్, నరేష్‌ను అడిగాడు.

అదే రోజు సాయంత్రం 6 గంటలకు వి.కోటకు వచ్చిన ఇస్మాయిల్, నరేష్‌కు ఫోన్‌ చేశాడు. రాత్రి 8 గంటల సమయంలో వీరిద్దరూ కలిసి మద్యం బాటిల్‌ తీసుకుని వి.కోట చెరువులోకి వెళ్లారు. అక్కడ మహిళ విషయంలో వీరి మధ్య వాదులాట జరిగింది. ఇదే అదనుగా నరేష్‌ మందు తాగుతున్నట్లు నటించి ఇస్మాయిల్‌ మందు తాగే సమయంలో మందు బాటిల్‌తో తలపై  బలంగా కొట్టి చంపేశాడు. ఇస్మాయిల్‌ చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత అక్కడే ఇసుక కోసం తవ్విన గుంతల్లో ఇస్మాయిల్‌ మృతదేహాన్ని చేతులతో మట్టిని కప్పి వెళ్లిపోయాడు.
చదవండి: చెట్టుకింద గొయ్యిలో ఏదో పూడ్చిపెట్టినట్లు కనపడడంతో.. పశువుల కాపర్లు..

మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇస్మాయిల్‌ స్నేహితులను విచారించడంతో, నరేష్‌ సోమవారం తన నేరాన్ని  పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఇస్మాయిల్‌ను పాతిపెట్టిన ప్రదేశానికి మండల రెవెన్యూ సిబ్బంది, పోలీసులు చేరుకు న్నారు. అయితే చెరువులో నీరు ఎక్కువగా ఉండడంతో మృతదేహాన్ని వెలికి తీయడం సాధ్యం కాలేదని సీఐ , తహసీల్దార్‌ పుల్లారావు తెలిపారు. ఇస్మాయిల్‌ మొబైల్‌ఫోన్‌ ఆధారంగా హత్య కేసు మిస్టరీని ఛేదించిన అభినందనలు అందుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top