వినోద్‌ కోసం ‘మహా’ పోలీసుల వేట! 

Maharashtra Cops Search For Main Accused In Dance Teacher To Drug Peddler Case - Sakshi

‘డ్యాన్స్‌ టీచర్‌ టు డ్రగ్‌ పెడ్లర్‌’ కేసు  

కూకట్‌పల్లికి చెందిన శివశంకర్‌ 

గత వారం అరెస్టు అతడి వద్ద నుంచి గంజాయి, మరో డ్రగ్‌ స్వాధీనం 

మాజీ సహోద్యోగి కోసం గాలిస్తున్న అక్కడి పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయిన డ్యాన్స్‌ మాస్టర్‌ను డ్రగ్ పెడ్లర్‌గా మార్చిన కేసులో కీలక నిందితుడిగా ఉన్న వినోద్‌ కోసం మహారాష్ట్ర పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఇతడి మాజీ సహోద్యోగి అయిన కూకట్‌పల్లి వాసి శివశంకర్‌ను నాగ్‌పూర్‌లోని బెల్ట్రారోడి పోలీసులు గత వారం అరెస్టు చేశారు. ఇతడి విచారణలోనే నగరానికి చెందిన వినోద్‌ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అక్కడ నుంచి ఓ ప్రత్యేక బృందం సిటీకి చేరుకుని గాలింపు చేపట్టింది.  

వరంగల్‌కు చెందిన ఇసాంపల్లి శివశంకర్‌ భార్య ఇద్దరు పిల్లలతో కూకట్‌పల్లి పరిధిలోని రామ్‌నగర్‌లో నివసిస్తూ అక్కడి ఓ ప్రముఖ పాఠశాలలో డ్యాన్స్‌ టీచర్‌గా చేరాడు. అయితే గత ఏడాది లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ ఇతడిపై పడింది. పాఠశాల మూతపడటంతో ఉద్యోగం కోల్పోయాడు. ఆ తర్వాత కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్న ఇతగాడికి తన మాజీ సహోద్యోగి వినోద్‌ తారసపడ్డాడు. తాను మరికొందరితో కలిసి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నానంటూ చెప్పిన వినోద్‌ సహకరించాలని కోరాడు. దీనికి శివశంకర్‌ అంగీకరించడంతో తాము గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను నింపిన కారు అందిస్తామని, దాన్ని ఢిల్లీ తీసుకువెళ్లి రిసీవర్లకు ఇచ్చి రావాలంటూ వినోద్‌ చెప్పాడు. ట్రిప్పుకు రూ.10 వేలు చెల్లిస్తాననటంతో శివశంకర్‌ అంగీకరించాడు.ఈ క్రమంలో నాగ్‌పూర్‌లోని వార్ధా రోడ్డులో ఉన్న పంజారి ప్రాంతంలో పోలీసులకు తారసపడ్డాడు. 

ఆ ప్రాంతంలో రాత్రి వేళ లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో బెల్ట్రారోడి పోలీసులు వివిధ ప్రాంతాల్లో నాకాబందీలు ఏర్పాటు చేశారు. ఓ పికెట్‌లో ఉన్న పోలీసులను చూసిన శివశంకర్‌ కారును వదిలి పారిపోవడానికి ప్రయత్నించాడు. అదుపులోకి తీసుకొని రూ.13.73 లక్షల విలువైన 91 కేజీల గంజాయి, గుర్తు తెలియని మాదకద్రవ్యాలు వెలుగులోకి వచ్చాయి.  శివశంకర్‌ను అరెస్టు చేసిన పోలీసులు వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో బెల్ట్రారోడి పోలీసులకు చెందిన బృందం నగరానికి చేరుకుని గాలిస్తోంది. ఈ వ్యవహారం వెనుక పెద్ద రాకెట్‌ ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

శివశంకర్‌ నడిపిన కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్నప్పటికీ తరచు నగరానికి వచ్చివెళ్లడమో, ఇక్కడి వారి వద్దే ఉండటమో జరిగిందని భావిస్తున్నారు. గత నెల 11న ఈ వాహనం రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌లో వెళ్తుండగా మేడ్చెల్‌ చెక్‌పోస్టు వద్ద ట్రాఫిక్‌ పోలీసు కెమెరాకు చిక్కింది. ఈ నేపథ్యంలోనే దీనిపై అధికారులు రూ.1100 జరిమానా కూడా విధించారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటున్న అధికారులు వినోద్‌ లేదా ఆ ముఠాకు చెందిన మరో వ్యక్తి ఆ ప్రాంతానికి చెందిన వాడై ఉంటాడని అనుమానిస్తున్నారు.  

చదవండి: కొనసాగుతున్న ‘గసగసాల’ నిందితుల అరెస్టులు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top