క్రెడిట్‌ కార్డుదారులను నిండా ముంచిన ప్రేమికులు

Madhya Pradesh: Love Couple Arrested For Duping Bank Customers - Sakshi

భోపాల్‌: తన కన్నా తక్కువ వయసున్న యువకుడితో ఆ యువతి ప్రేమలో పడింది. వారి మధ్య వయసు తేడా ఉన్నా ఎంచక్కా ప్రేమించుకుంటున్నారు. కలిసిమెలసి తిరుగుతూ ఊహలోకంలో తిరుగుతున్నారు. అయితే తమ జల్సాల కోసం వారు వక్రమార్గం పట్టారు. అమాయికులే లక్ష్యంగా చేసుకుని వారికి తెలియకుండానే రూ.లక్షల్లో దోచేసుకుంటున్నారు. ఆ విధంగా ఏకంగా రూ.11.50 లక్షల్లో టోకరా కొట్టి దర్జాగా తిరుగుతున్నారు. వారి ఆటను పోలీసులు కట్టడి చేశారు. ఇప్పుడు వారిద్దరూ జైలు పాలయ్యారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఎలా మోసం చేశారో తెలుసుకోండి. జబాల్‌పూర్‌ జిల్లాకు చెందిన 19 సంజనా గుప్తా 17 ఏళ్ల బాలుడితో ప్రేమలో పడింది. మైనర్‌ కావడంతో పేరు వెల్లడించలేదు. వీరిద్దరూ కలిసి పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో భారీగా మోసాలు చేశారు. అదుపులోకి తీసుకున్నప్పుడు వారు ఎలా నేరాలు చేసేవారో పోలీసులకు పూసగుచ్చినట్టు చెప్పారు. సీనియర్‌ పోలీస్‌ అధికారి సిద్ధార్థ్‌ బహుగుణ ఆ వివరాలు వెల్లడించారు.

హైటెక్‌ మోసం
‘ఎస్‌బీఐ బ్రాంచ్‌లను సందర్శించి క్రెడిట్‌ కార్డుదారుల వివరాలు సేకరించారు. వారి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్‌ ఖాతా వివరాలతో పాటు, ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్‌ అన్నీ తీసుకుంటారు. వారిలో ఖాతాదారుల సంతకాలు (సిగ్నేచర్‌) ఎవరివి సులువుగా ఉంటే వారి తీసుకున్నారు. ఆ సంతకాలను వారు తీసుకుని బ్యాంక్‌కు వెళ్లి తమ సంతకాలు మరిచిపోయామని, ఫోన్‌ నంబర్లు మార్చాలని ఖాతాదారుల పేరుపై వీరు దరఖాస్తు చేసుకున్నారు. ఆ విధంగా చేసి మొబైల్‌ ఫోన్‌లో ఆ ఖాతాదారుల అకౌంట్‌ ఓపెన్‌ చేసి డబ్బులు విత్‌ డ్రా చేసుకున్నారు. అలా జూన్‌ 30వ తేదీ నుంచి జూలై 16 మధ్య చాలా బ్యాంక్‌ ఖాతాల నుంచి డబ్బులు విత్‌ డ్రా చేశారు.’ ఆ వచ్చిన డబ్బులతో ఇద్దరూ జల్సాలు చేశారు.

అయితే తమ ఖాతా నుంచి ఎవరో డబ్బు డ్రా చేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బరేలా, పనాగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిల్లో ఇద్దరు, సిహోరా స్టేషన్‌ ఒక బాధితుడు ఫిర్యాదు చేశారు. వరుస ఘటనలు జరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మోసం వెలుగులోకి వచ్చింది. వీరిని ఆచూకీ కనుక్కుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.పది వేల నగదు, రూ.లక్షన్నర విలువైన ఆభరణాలు, రూ.లక్షకు పైగా విలువైన సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి సిద్ధార్థ్‌ బహుగుణ వెల్లడించారు. వారిని రిమాండ్‌కు తరలించారు. అయితే ఆమె ప్రియుడు మైనర్‌ కావడంతో అతడిని జువైనల్‌ హోమ్‌కు తరలించారు. వీరి బారిన ఇంకేవరైనా పడి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని, తరచూ పాస్‌వర్డ్‌లు మారుస్తూ ఉండాలని సూచించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top