ఆపరేషన్‌ కంబోడియాపై విశాఖ సీపీ కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

చైనా గ్యాంగ్‌ను పట్టుకుంటాం.. ఆపరేషన్‌ కంబోడియాపై విశాఖ సీపీ కీలక వ్యాఖ్యలు

Published Fri, May 24 2024 10:39 AM

Key Breakthrough In Human Trafficking Gang Case: Visakha Cp Ravi Shankar

సాక్షి, విశాఖపట్నం: దేశంలో సంచలన రేపిన హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కేసులో కీలక పురోగతి సాధించామని విశాఖ సీపీ రవిశంకర్‌ అన్నారు. ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ, కంబోడియా నుంచి విశాఖకి చెందిన 58 మందిని మేము భారత్ కి తీసుకొని వచ్చామని వెల్లడించారు.

ఇప్పటికే వారు ఢిల్లీకి వచ్చి ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 5:15 నిమిషాలకు విశాఖకి బాధితులు వస్తారు. ఎన్.ఐ.ఎలో నాకున్న అనుభవంతో దర్యాప్తు వేగవంతం చేస్తున్నా. ఈ ముఠా వెనుక ఉన్న చైనా గ్యాంగ్‌ను పట్టుకుంటామని సీపీ తెలిపారు.

కాగా, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేపట్టింది.

ఇది జరిగింది..
గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్‌ చుక్కా రాజేష్‌ (32) 2013 నుంచి 2019 వరకు గల్ఫ్‌ దేశాల్లో ఫైర్‌ సేఫ్టీ అండ్‌ ప్రికాషన్‌ మేనేజర్‌గా పనిచేశాడు. ఆ తరువాత విశాఖలోనే ఉంటూ గల్ఫ్‌దేశాలకు ఫైర్‌ సేఫ్టీ ఉద్యోగాలకు మానవవనరులను సరఫరా చేసేవాడు. 2023 మార్చిలో  కాంబోడియా నుంచి సంతోష్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసి, కాంబోడియాలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేయడానికి 30 మందిని పంపాలని రాజేష్‌ను కోరాడు.  

ఆసక్తి చూపే వారి నుంచి ఫ్లైట్‌ టికెట్లు, వీసా, ఇతర ఖర్చుల కోసం రూ.1.5 లక్షల వంతున తీసుకోవాలని, అందులో కొంత కమిషన్‌గా ఇస్తామని ఆశ చూపాడు. రాజేష్‌ అందుకు అంగీకరించి సోషల్‌ మీడియా ద్వారా విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. నిజమని నమ్మిన 27 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షల వంతున కట్టారు. రాజేష్‌ వారిని కాంబోడియా ఏజెంట్‌ సంతోష్‌కు అప్పగించాడు.

ఇలా మూడు దఫాలుగా నిరుద్యోగులకు కాంబోడియాకు పంపించాడు. కొద్ది రోజులకు ఆర్య అనే పేరుతో ఒక మహిళ రాజేష్‌కు ఫోన్‌ చేసింది. సంతోష్‌ కంటే ఎక్కువ కమిషన్‌ ఇస్తానని తమకూ మానవవనరులను సరఫరా చేయాలని కోరింది. ఇలా రాజేష్‌.. సంతోష్, ఆర్య, ఉమా మహేష్, హబీబ్‌ అనే ఏజెంట్ల ద్వారా 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు పంపించాడు.

ఒప్పందం అనంతరం వారిని కాంబోడియాలోనే ఈ ముఠా  ఒక చీకటి గదిలో బంధించింది. ఫెడెక్స్, టాస్క్‌గేమ్స్, ట్రేడింగ్‌తో పాటు అనేక ఆన్‌లైన్‌ స్కాములు చేయాలని నిరుద్యోగులను బలవంతం చేసింది. ఈ స్కామ్స్‌ ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. అక్రమాలకు పాల్పడబోమని మొండికేసిన వారికి తిండి పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేసింది.

సైబర్‌ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమిషన్‌గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్‌ దోచుకునేది. అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్‌లో పలు రకాల పబ్, క్యాసినో గేమ్స్, మద్యం, జూదంతో పాటు వ్యభిచారం వంటి సదుపాయాలను ఈ ముఠా కల్పించింది. అక్కడ సంపాదించిన డబ్బు అక్కడే ఖర్చు చేసేలా చేసేది.    

చైనా ముఠా చెరలో 5వేల మంది..
చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ నుంచే 150 మంది చైనా గ్యాంగ్‌ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. బాధితులు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, అనంతపురాలతో పాటు తెలంగాణ, కోల్‌కత్తాకు చెందిన వారూ ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement