నాలుగేళ్ల ప్రేమ, పెళ్లి.. ఇప్పుడు కులం చిచ్చు!

karimnagar: Inter Caste Marriage Woman Commits Suicide - Sakshi

భర్త కాపురానికి తీసుకెళ్లక పోవడం

బంధువులు కులం పేరుతో దూషించడంతో మనస్తాపం

బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న జడ్జి

ఇల్లందకుంట(హుజూరాబాద్‌): ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇతరుల మాటలు విని కాపురానికి తీసుకెళ్లక పోవడం, అత్తింటివారు కులం పేరుతో దూషించడంతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లికి చెందిన చిట్యాల సంధ్యకు కేశవపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అన్నె సంతోష్‌తో నాలుగేళ్ల కిందట పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత అది ప్రేమగా మారింది. వేర్వేరు కులాలు కావడంతో 2020 మార్చి 16న ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం ఇప్పలపల్లికి వెళ్లారు. దాదాపు 10 నెలలు సజావుగా సాగిన వీరి కాపురంలో కులం చిచ్చు రగిలింది. సంతోష్‌ తండ్రి సమ్మయ్య, వారి బంధువులు గుంటి తిరుపతి, కొండయ్యలు కులం పేరుతో సంధ్యను దూషించడం మొదలుపెట్టారు. దీనికితోడు సంతోష్‌ సంధ్యను పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది.

సంతోష్‌ తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని సంధ్య ఇల్లందకుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సోమవారం ఇల్లందకుంటలో పంచాయితీ చేసుకుందామని చెప్పిన సంతోష్‌ కుటుంబీకులు అక్కడికి రాకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో ఠాణాకు కొద్ది దూరంలో వారు పెళ్లి చేసుకున్న ఆలయం ఎదుటే నిద్రమాత్రలు మింగింది. కుటుంబసభ్యులు జమ్మికుంటలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్‌ తెలిపారు. హుజూ రాబాద్‌ ఫస్ట్‌ క్లాస్‌ అడిషనల్‌ జడ్జి స్వాతిభవాని సంధ్య నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.

చదవండినా కూతుర్నే ప్రేమిస్తావా.. యువకుడిపై దారుణం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top