సాక్షి, హైదరాబాద్: ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. అంతమొందించిన దుండుగలే మృతదేహాన్ని గోనె సంచీలో మూటగట్టి ఇంటి ముందే మృతదేహాన్ని వదిలేయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంజయ్‌గాంధీనగర్‌లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం, వెలిమెల గ్రామానికి చెందిన సురేష్ (28) 2016లో రేణుకను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ఇద్దరు కొన్నేళ్ల నుంచి సంజయ్‌గాం«దీనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారికి ఆరేళ్లు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు ఆడ పిల్లలున్నారు. సురేష్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తుండగా రేణుక ఇంటి వద్దనే ఉంటోంది. ఆదివారం భర్త సురేష్‌ను ఆహారం తీసుకురమ్మని రేణుక బయటకు పంపింది. అర్ధరాత్రి అయినా సురేష్ ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ సైతం ఇంట్లో వదిలి వెళ్లినట్లు గుర్తించారు.
సోమవారం తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో ఇంటి ముందు గోనె సంచీలో మృతదేహం ఉన్నట్లు ఇంటి యజమాని గుర్తించాడు. దగ్గరకు వెళ్లి చూడగా సురేష్ రక్తపు మడుగులో ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
భార్యే హత్య చేయించిందా..!
మృతుడు సురేష్ హత్య వెనుక భార్య హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరి కొంత మంది వ్యక్తులతో కలిసి రేణుక పథకం ప్రకారం హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో జీడిమెట్ల పోలీసులు రేణుకను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment