జగ్గంపేటలో భారీ చోరీ 

Gold Jewelery And Bike Worth Rs 12 Lakh Stolen In East Godavari - Sakshi

తాళాలు పగులకొట్టి   దోచుకెళ్లిన దుండగులు 

రూ.12 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, బైక్‌ అపహరణ

గండేపల్లి/జగ్గంపేట: ఒక విశ్రాంత ఉద్యోగి ఇంట్లోకి బుధవారం అర్ధరాత్రి దుండగులు ప్రవేశించి రూ.12 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు, ఒక బైక్‌ను దొంగిలించుకుపోయారు. జగ్గంపేట బాలాజీనగర్‌లోని ఘటనా స్థలాన్ని సీఐ బి.సూర్య అప్పారావు, ఎస్‌ఐ సీహెచ్‌ విద్యాసాగర్‌ పరిశీలించారు. వారి వివరాల మేరకు ఉప్పలపాడుకు చెందిన బుర్రి వెంకటరమణ ఉద్యోగ రీత్యా బాలాజీనగర్‌లో ఇటీవల నిర్మించుకున్న మూడు అంతస్తుల భవనంలో రెండవ అంతస్తులో నివాసం ఉంటున్నారు.

ఆయన బంధువైన విశ్రాంత ఉద్యోగి (బీఎస్‌ఎన్‌ఎల్‌) పుర్రె సూరన్న, ఉమాదేవి మొదటి అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. సూరన్న, ఉమాదేవి బుధవారం మధ్యా«హ్నం కాకినాడ వెళ్లి రాత్రికి అక్కడ ఉన్న తమ సొంత ఇంట్లో ఉండిపోయారు. తెల్లావారేసరికి జగ్గంపేటలో వారు ఉంటున్న ఇంటి తలుపు తాళాలతోపాటు బీరువా తాళాలు పగులకొట్టి ఉన్నాయి. ఇంటి యజమాని బుర్రి వెంకటరమణ గమనించి సమాచారం అందించడంతో వారు వెంటనే జగ్గంపేట చేరుకున్నారు. ఇంట్లో గల బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి.

దుస్తులు, వెండి వస్తువులు చెల్లా చెదురు అయ్యాయి. లాకర్‌లో ఉన్న 26 కాసుల బంగారు వస్తువులు చోరీ అయినట్టు గుర్తించారు. మూడు ఉంగరాలు, నక్లెస్, కాసులపేరు, ఏడు జతల చెవి దుద్దులు, నాలుగు లాకెట్స్, నల్లపూసల గొలుసు, పూజా పుష్పం, గోల్డ్‌ బిస్కెట్, మూడు గొలుసులతోపాటు మోటార్‌ సైకిల్‌ చోరీకి గురైనట్టు గుర్తించి స్థానిక పోలీస్‌ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న కాకినాడ క్రైం డీఎస్పీ రాంబాబు, పెద్దాపురం ఇన్‌చార్జి డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, జగ్గంపేట సీఐ, ఎస్‌ఐ బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ క్లూస్‌ టీం వేలి ముద్రలు సేకరించగా డాగ్‌ స్క్వాడ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించింది. చోరీ జరిగిన ఇంటికి సమీపంలో గల ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో బుధవారం అర్ధరాత్రి 1.16 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి రోడ్డుపై తచ్చాడటాన్ని గుర్తించారు. నీలాద్రిరావుపేట, తదితర చోట్ల గల సీసీ కెమెరాలను పోలీసు బృందాలు తనిఖీ చేస్తున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top