కొరియర్‌ వచ్చిందని చెప్పి.. 

Gold Chain Stolen From Old Womans Neck After Threatening With Knife - Sakshi

సాక్షి, లంగర్‌హౌస్‌: కొరియర్‌ వచ్చిందంటూ పలు మార్లు ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లి ఆమెను కత్తితో బెదిరించి బంగారు గొలుసు లాక్కెళ్లిన యువకుడిని లంగర్‌హౌస్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఐ ముజీబ్‌ ఉర్‌ రెహమాన్, డీఎస్సై రాఘవేంద్ర స్వామిలతో కలిసి ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ శివమారుతి వివరాలు వెల్లడించారు. కామారెడ్డికి చెందిన సయ్యద్‌ హమీద్‌ మెహిదీపట్నంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ డెలివరీ బాయ్‌గా పని చేసేవాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన అతను తన తమ్ముడి ఫీజు కట్టడానికి చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు.

తాను డెలివరీ చేసే ప్రాంతాలను పరిశీలిస్తూ అదును కోసం ఎదురు చూస్తున్నాడు. నెల రోజుల క్రితం మారుతీ నగర్‌లోని ఓ ఇంట్లో డెలివరీ ఇచ్చాడు. సదరు వృద్ధురాలు ఒక్కరే ఉండటంతో పలుమార్లు అక్కడ చోరీకి ప్రయత్నించిన విఫలమయ్యాడు. ఈ నెల 23న మరోసారి ఆమె ఇంటికి వెళ్లిన హమీద్‌ కొరియర్‌ వచ్చిందని చెప్పాడు. అయితే ఆమె డోర్‌ తీయకుండా తన కుమారుడు వచ్చాకే అతనికే ఇవ్వాలని చెప్పింది.

అదే రోజు పలుమార్లు ఆమె ఇంటికి వెళ్లి కొరియర్‌ తీసుకోవాలని ఒత్తిడి చేసినా ఆమె నిరాకరించింది. సాయంత్రం అతను వెళ్లిపోయాడని భావించిన వృద్ధురాలు తలుపులు తెరిచి చూడగా పక్కనే దాగి ఉన్న సయ్యద్‌ ఇంట్లోకి దూరి ఆమెను కత్తితో బెదిరించి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 29న అతడిని అదుపులోకి తీసుకుని, సోమవారం  రిమాండ్‌కు తరలించారు. 

పోలీసులకు రివార్డులు.... 
సయ్యద్‌ హెల్మెట్‌ ధరించి ఎలాంటి ఆధారాలు లేకుండా చోరీ చేసినా పోలీసులు చాకచక్యంగా అతడిని పట్టుకున్నారు.  కేసును ఛేదించిన కానిస్టేబుళ్లు మొహమ్మద్‌ మిన్హజుద్దీన్‌ ఖాన్, వల్లపు క్రిష్ణ, అరవింద్‌కుమార్‌లకు రివార్డులు అందించి అభినందించారు.  

(చదవండి: ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పినా.. )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top