పందుల దొంగల ముఠా.. బొలేరోతో ఢీకొట్టి.. ఎంత పనిచేశారంటే..

Gang Of Pig Thieves Assassination Young Man In Kurnool District - Sakshi

ఆదోని రూరల్‌(కర్నూలు జిల్లా): ఆదోని పట్టణంలో పందులు, గొర్రెలను అపహరించేందుకు వచ్చిన కర్ణాటక గ్యాంగ్‌ హల్‌చల్‌ సృష్టించింది. వారి వాహనాన్ని అడ్డగించేందుకు యత్నించిన యువకుడిని ఢీకొట్టి చంపేశారు. ఇస్వీ ఎస్‌ఐ విజయలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం తెల్లవారుజామున కర్ణాటకు చెందిన కేఏ25 ఏఏ 4030 నంబర్‌ బొలేరో ట్రక్కు వాహనంలో టీజీఎల్‌ కాలనీ, బొబ్బలమ్మ గుడి ఏరియా ప్రాంతాల్లో పందులను అపహరించేందుకు ఓ దొంగల ముఠా చేరుకుంది.

చదవండి: భర్త అదృశ్యం.. ఇంట్లో రక్తపు మరకలు.. భార్య వివాహేతర సంబంధమే కారణమా..?

పందుల యజమానులు గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పట్టణ శివారులోని శిరుగుప్పక్రాస్‌ రోడ్డు వద్ద వారి వాహనానికి టీజీఎల్‌ కాలనీకి చెందిన సురేష్‌(19) తన బైక్‌ను అడ్డుగా పెట్టి పక్కనే నిలిచాడు. దొంగలు వాహనాన్ని ఆపకుండా వేగంగా ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో దొంగలకు చెందిన బొలేరో వాహనం బోల్తా పడటంతో.. వాహనాన్ని వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఇస్వీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

మృతుడి సోదరుడు ఈరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విజయలక్ష్మి తెలిపారు. కర్ణాటకకు చెందిన పందుల దొంగల ముఠా ఇటీవల ఆదోని మండలంలో మదిరె, హాన్వాల్, పెద్దతుంబళం, కోసిగి తదితర ప్రాంతాల్లో పట్టపగలు ఇళ్లలో దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేగాకుండా ఆరు నెలల క్రితం గూడూరు వద్ద పందులను అపహరించి తరలిస్తున్న ముఠాపై స్థానికులు వెంబడించగా, మండల పరిధిలోని దొడ్డనగేరి గ్రామ సమీపంలో వాహనం టైరు పేలడంతో వాహనాన్ని వదిలి పరారయారు. పందుల దొంగలను అరెస్ట్‌ చేసి శిక్షించాలని పందుల యజమానులు కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top