సినిమా తలపించేలా షాకింగ్‌ ట్విస్ట్‌.. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడని..

Friend Accused In Attempted Assassination Case In Guntur District - Sakshi

తెనాలి రూరల్‌: తెనాలిలో ప్రైవేటు ఉపాధ్యాయుడిపై శుక్రవారం రాత్రి హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో అతని మిత్రులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. క్షతగాత్రుడు పల్లపురం గణేష్‌బాబు గతంలో నందులపేటలో నివసించేవాడు. అదే ప్రాంతానికి చెందిన బాషా, బాబి, అరవింద్‌ ఇతర యువకులు గణేష్‌ బాబుకు మిత్రులుగా ఉండేవారు. వీరిలో బాషా నందులపేటకు చెందిన యువతిని ప్రేమించేవాడు. 2018 డిసెంబర్‌లో ఫొటోగ్రాఫర్‌ రబ్బాని, మరో యువకుడిపై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు.

ఈ కేసులో జైలుకు వెళ్లగా అతడు ప్రేమించిన వ్యక్తి గణేష్‌బాబుకు దగ్గరైంది. ఇద్దరూ గతేడాది వివాహం చేసుకున్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గణేష్‌బాబు ప్రస్తుతం నాజరుపేటలో నివసిస్తున్నాడు. పాఠశాల అనంతరం ఇంటివద్ద విద్యార్థులకు ట్యూషన్‌లు చెప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శుక్రవారం రాత్రి బాషా, బాబి, అరవింద్‌ నాజరుపేటలోని గణేష్‌బాబు ఇంటికి వెళ్లి అతడిని బయటకు వెళదామని పిలిచారు. వారి వెంట మరో బుల్లెట్‌పై నందులపేట వెళ్లగా అక్కడ బాషా, మిగిలిన ఇద్దరూ కత్తితో గణేష్‌బాబు గొంతు కోసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

కత్తితో దాడి అనంతరం బుల్లెట్‌పై ఎక్కించుకుని మరో ప్రాంతానికి తీసుకెళుతుండగా, గణేష్‌బాబు వాహనం నుంచి దూకి వారి నుంచి తప్పించుకుని నెహ్రూ రోడ్డులోని ప్రైవేటు వైద్యశాలకు వెళ్లి చేరాడు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం తాడేపల్లిలోని ప్రైవేటు వైద్యశాలకు పంపారు. గణేష్‌బాబు నివసించేది వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో, అతడిపై కత్తితో దాడి జరిగింది టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు ప్రాంతాలనూ వన్‌టౌన్, టూ టౌన్‌ సీఐలు కె.చంద్రశేఖర్, ఎస్‌.వెంకట్రావు పరిశీలించారు.

టూ టౌన్‌ పరిధిలో ఘటన జరగడంతో ఆ పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు బాష, మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌లనూ పోలీసులు పరిశీలించి సాక్ష్యాలను సేకరించినట్టు తెలిసింది. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకున్నాడన్న కారణంతో బాషా, మిత్రులతో కలసి ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.  

మరిన్ని వార్తలు :

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top