
గంజాయి స్మగ్లింగ్ వ్యవస్థ బలోపేతమవుతోంది. ఒక రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. సులువైన మార్గాలను అన్వేషిస్తూ యథేచ్చగా అందిస్తున్నారు.
ఖమ్మం రూరల్: మండల పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్డులో పోలీసులు రూ.25 లక్షల విలువైన 1.7 క్వింటాళ్ల గంజాయిని బుధవారం పట్టుకున్నారు. ఖమ్మం రూరల్ సీఐ పి.సత్యనారాయణరెడ్డి, ఎస్సై శంకర్‌రావు కథనం ప్రకారం.. విశాఖపట్నం జిల్లా చోడవరం గ్రామానికి చెందిన కోళ్లు తరలించే వ్యాన్ డ్రైవర్ బొబ్బిలి సాయి, ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన మరో డ్రైవర్ గుంజి వెంకట్రావు, విశాఖపట్నానికి చెందిన తేలు నాగా వెంకట సత్యనారాయణ, మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన విశాల్ అంకుష్ కలిసి గంజాయి తరలిస్తున్నారు.
ఏపీలోని విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం నుంచి సత్తుపల్లి, ఖమ్మం మీదుగా మహారాష్ట్రలోని షోలాపూర్‌కు కోళ్లు తరలించే రెండు వ్యాన్లలో తీసుకెళ్తున్నారు. కోదాడ క్రాస్‌రోడ్డు వద్ద వాహన తనిఖీ చేస్తున్న పోలీసులకు కోళ్లు తరలించే వ్యాన్లలో ఉన్న వారిపై అనుమానం వచ్చింది. తనిఖీ చేయగా, వ్యాన్‌పైన మామూలుగానే ఉన్నా కింద ప్రత్యేక అరలు ఏర్పాటుచేసి ప్యాక్ చేసిన గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈమేరకు గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.