హత్యకు ఆరు నెలలుగా కుట్ర ..  గతంలో భర్త.. ఇప్పుడు భార్య!

Ex Corporator Assasination Issue In Karnataka - Sakshi

సాక్షి, బనశంకరి(కర్ణాటక): బెంగళూరులో చలవాదిపాళ్య వార్డు (138) మాజీ కార్పొరేటర్‌ రేఖా కదిరేశ్‌ హత్య కేసులో మరో ముగ్గురిని పశ్చిమ విభాగపోలీసులు అరెస్ట్‌ చేశారని డీసీపీ సంజీవ్‌పాటిల్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. చలవాదిపాళ్య స్టీఫెన్, అజయ్, పురుషోత్తం అరెస్టులతో పట్టుబడిన వారి సంఖ్య ఆరుగురికి చేరుకుంది. పీటర్, సూర్యలు రేఖాపై చాకులతో దాడిచేసే సమయంలో ఎవరూ అడ్డుకోకుండా పురుషోత్తం కాపుకాశాడు. స్టీఫెన్, అజయ్‌లు పరిస్థితిని గమనిస్తూ ఉండి, హత్యా పథకాన్ని అమలు పరిచారు. శుక్రవారం మధ్యాహ్నం పీటర్, సూర్య తమిళనాడుకు పారిపోయే ప్రయత్నంలో ఉండగా సుంకదకట్టె వద్ద పోలీసులు కాళ్లపై కాల్పులు జరిపి అరెస్ట్‌ చేశారు. స్టీఫెన్‌ ఈ హత్యకు ప్లాన్‌ రూపొందించి మిగిలినవారితో కలిసి అమలు చేశాడు.  6 నెలల నుంచి ఈ హత్యకు కుట్ర పన్నాడని, ఇందుకు రూ.25 లక్షలు ఆర్థిక లావాదేవీలు చేసినట్లు తెలిసింది.  

సోదరి కొడుకు విచారణ..  
రేఖా సోదరి మాలా కుమారుడు అరుణ్‌ను విచారిస్తున్నారు. మరో 25 మందిని అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో ప్రశ్నిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. సుమారు మూడేళ్ల కిందట కార్పొరేటర్‌ కదిరేశ్‌ను ప్రత్యర్థులు హత్య చేశారు. ఆ తరువాత ఉప ఎన్నికల్లో భార్య రేఖ కార్పొరేటర్‌గా ఎన్నికైంది. ఆమె తమకు డబ్బులు ఇవ్వలేదని, పట్టించుకోలేదని కోపం పెంచుకున్నారు. గతంలో అందరూ కదిరేశ్‌కు అనుచరులుగా ఉండగా, రేఖ వచ్చాక వారి పనులు నచ్చక దూరం పెట్టిందని చెబుతున్నారు.  

సీసీ కెమెరాలు తిప్పి హత్య..  
హత్య సమయంలో ఫ్లవర్‌గార్డెన్‌ బీజేపీ కార్యాలయం వద్ద అమర్చిన సీసీ కెమెరాలను దుండగులు మరోవైపునకు తిప్పేశారు. కానీ రేఖాను నరికి చంపుతున్న దృశ్యాలను స్థానికులు మొబైల్స్‌లో చిత్రీకరించారు. హత్య జరిగిన వెంటనే బైక్‌లు, ఆటోలు మారుతూ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. పీటర్,  మూడు హత్యకేసులు, రెండు దాడులు, దోపిడీ కేసుల్లో పాత్ర ఉంది.  సూర్యపై రెండు హత్యకేసులున్నాయి. గంజాయి దందాకు పాల్పడేవారు. వీరి ఆగడాలపై రేఖా ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోపం పెంచుకున్నట్లు సమాచారం.  

చదవండి: వసతి గృహంలో కీచక్‌ హెచ్ఎం.. దివ్యాంగులైన బాలికలపై..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top