డేటా లీకుపై 'ఈడీ ఆరా' | Enforcement Directorate Investigation On Data Leak | Sakshi
Sakshi News home page

డేటా లీకుపై 'ఈడీ ఆరా'

Apr 3 2023 1:30 AM | Updated on Apr 3 2023 1:30 AM

Enforcement Directorate Investigation On Data Leak - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని సగం జనాభా వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి, విక్రయించిన కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టిసారించింది. 70 కోట్ల మంది ప్రజలు, సంస్థలకు చెందిన వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని చోరీ చేసిన ఫరీదాబాద్‌ (హరియాణా)కు చెందిన వినయ్‌ భరద్వాజ్‌పై ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేయనుంది.

ఇప్పటికే 17 కోట్ల మంది డేటా లీకు కేసులో సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన నిందితులు నితీశ్‌ భూషణ్‌ కుమార్, పూజా కుమారి, సుశీల్‌ తోమర్, అతుల్‌ ప్రతాప్‌ సింగ్, ముస్కాన్‌ హసన్, సందీప్‌ పాల్, జియా ఉర్‌ రెహ్మాన్‌లపై పీఎంఎల్‌ఏ చట్టం కింద కేసు నమోదు చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా దేశంలోని అతిపెద్ద డేటా లీకు కేసులో ప్రధాన సూత్రధారి వినయ్‌ భరద్వాజ్‌పై కూడా ఈడీ కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రజల వ్యక్తిగత సమాచారంతోపాటు రక్షణ, టెలికం, విద్యుత్, ఇంధనం, జీఎస్‌టీ వంటి ముఖ్యమైన ప్రభుత్వ శాఖల కీలక సమాచారాన్ని నిందితులు తస్కరించి, బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

నిందితుల కార్యకలాపాల్లో ఆర్థిక లావాదేవీల నిర్వహణతోపాటు ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈమేరకు మనీలాండరింగ్‌ కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. 
 
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం 
ఆంధ్రపదేశ్, తెలంగాణతోపాటు 24 రాష్ట్రాలకు చెందిన ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని నిందితులు విక్రయానికి పెట్టారు. దీంతో అన్ని రాష్ట్రాల పోలీసులను సైబరాబాద్‌ పోలీసులు అప్రమత్తం చేశారు. వినయ్‌ భరద్వాజ్‌ ఏడాది కాలంగా ఫరీదాబాద్‌ కేంద్రంగా డేటా నిల్వ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.

ఇన్‌స్పైర్‌ వెబ్జ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఇప్పటివరకు 50 మందికి డేటాను విక్రయించినట్టు విచారణలో పోలీసులు గుర్తించారు. దీంతో నిందితుడి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లతోపాటు బ్యాంకు లావాదేవీలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఏడాది కాలంగా నిందితులు డేటా చోరీ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా.. ఏ రాష్ట్ర పోలీసులకు చిక్కకపోవటం గమనార్హం.  
 
ఈ–కామర్స్‌ కంపెనీలు, బ్యాంకులకు నోటీసులు 
ఈ–కామర్స్, ఐటీ కంపెనీలు వినియోగదారుల సమాచారంలో గోప్యత, భద్రత పాటించకపోవడం వల్లే డేటా లీకైనట్టు సైబరాబాద్‌ పోలీసులు నిర్ధారించారు. యూజర్ల సెన్సిటివ్‌ పర్సనల్‌ డేటా ఇన్ఫర్మేషన్‌ (ఎస్‌పీడీఐ)ను గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత సంస్థలదే. కానీ, ఆయా సంస్థలు ఐటీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినట్టు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు.

దీంతో ఆయా ఈ–కామర్స్‌ కంపెనీల చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్లను విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు బిగ్‌ బాస్కెట్, ఫోన్‌ పే, ఫేస్‌బుక్, క్లబ్‌ మహీంద్రా, పాలసీ బజార్, అస్ట్యూట్‌ గ్రూప్, యాక్సిస్‌ బ్యాంకు, మాట్రిక్స్, టెక్‌ మహీంద్రా, బ్యాంకు అఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలకు సెక్షన్‌ 91 కింద నోటీసులు జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement