వ్యాపారవేత్త ప్రవీణ్‌ రావత్‌ అరెస్టు 

ED Arrests Mumbai Businessman Pravin Raut In Money laundering case - Sakshi

మనీల్యాండరింగ్‌ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ

సాక్షి, ముంబై: మనీ ల్యాండరింగ్‌ కేసులో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ప్రముఖ వ్యాపారవేత్త ప్రవీణ్‌ రావత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విభాగం(ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ కంపెనీ(హెచ్‌డీఐఎల్‌)లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా ప్రవీణ్‌ రావత్‌ పేరు బయటకు వచ్చింది. పంజాబ్, మహరాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ)లో జరిగిన సుమారు రూ. 4,300 కోట్ల అక్రమాలపై ఈడీతోపాటు ఇతర నేర దర్యాప్తు సంస్థలు కూడా విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ కేసులో రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ప్రవీణ్‌ రావత్‌కు సంబంధాలున్నా యని ఆరోపణలు రావడంతో ఈడీ ఆయనను అరెస్టు చేసి ముంబైలోని కార్యాలయానికి తీసుకెళ్లింది.

ఆయనకు సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లలో కూడా మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యా ప్తు సంస్థ తనిఖీలు నిర్వహించింది. సబర్బన్‌ ముంబైలోని మహారాష్ట్ర హౌసింగ్‌ అండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎంహెచ్‌డీఏ)కు చెందిన ఓ భవనం పునర్నిర్మాణానికి ఎంహెచ్‌డీఏ నుంచి గురుఆశిష్‌ నిర్మాణ సంస్థ అనుమతి తెచ్చుకుంది. కాగా, ఈ ప్రాజెక్టులో ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌ఎస్‌ఐ) సంబంధించి జరిగిన అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఈడీ దర్యాప్తులో తేలింది. అయితే ఈ గురుఆశిష్‌ నిర్మాణ సంస్థ ప్రవీణ్‌రావత్‌దిగా ఈడీ విచారణలో తేలింది. ఇప్పటికే మనీల్యాండరింగ్‌ కేసుకింద ప్రవీణ్‌రావత్‌కు చెందిన రూ.72కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఈడీ విచారణలో హెచ్‌డీఐఎల్‌ ద్వారా పీఎంసీ బ్యాంకునుంచి అడ్వాన్సులు, రుణాల రూపంలో ప్రవీణ్‌ రావత్‌ రూ.95కోట్ల మేర లబ్ధి పొందినట్లు తేల్చింది.
చదవండి: బుధవారం వ్యాపారవేత్త ప్రవీణ్‌ రావత్‌ను అరెస్టు చేస్తున్న ఈడీ బృందం  

కాగా ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు లేవని ఈడీ చెబుతోంది. హెచ్‌డీఐల్‌కు చెందిన లెడ్జర్‌లో పాల్ఘర్‌ ప్రాంతంలో స్థల సేకరణ నిమిత్తం ప్రవీణ్‌ రావత్‌కు ఈ నిధులు ఇచ్చినట్లుగా ఉంది. పీఎంసీ బ్యాంకు కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్‌ రావత్‌ భార్య వర్షా రావత్‌ను గతేడాది ఈడీ విచారణ చేయగా ప్రవీణ్‌ రావత్‌ భార్య పేరు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. ప్రవీణ రావత్‌ రూ.1.6 కోట్లను తన భార్య మాధురి రావత్‌కు ట్రాన్సఫర్‌ చేయగా..ఆమె రూ.55 లక్షలను వడ్డీ లేని రుణంగా వర్షా రావత్‌కు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది.  వీటి ఆధారంగా ఈడీ 2020 అక్టోబర్‌లో మనీల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది.
చదవండి: జాతీయ గీతాన్ని అవమానించిన సీఎం మమతా బెనర్జీ.. కోర్టు సమన్లు జారీ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top