యూనివర్సిటీలో ర్యాగింగ్‌ కలకలం.. 80 చెంపదెబ్బలు కొట్టిన సీనియర్లు.. రెండో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి..

Dibrugarh University Ragging Student Jumped Hostel Building - Sakshi

దిస్పూర్‌: అస్సాం డిబ్రూగఢ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. సీనియర్ల టార్చర్ భరించలేక ఓ విద్యార్థి హాస్టల్ రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్రగాయాల పాలైన అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

బాధితుడ్ని శివసాగర్ జిల్లా అమ్గూరికి చెందిన ఆనంద్ శర్మగా గుర్తించారు. ఈ యూనివర్సిటీలో ఎంకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే తమ కుమారుడ్ని సీనియర్లు వారం రోజులుగా వేధిస్తున్నారని అతని తల్లి తెలిపింది. ఆదివారం కూడా 80 చెంపదెబ్బలు కొట్టారని, కర్రలు, బాటిళ్లతో  టార్చర్ చేశారని వెల్లడించింది. అది భరించలేకే తన కుమారుడు భవనం పైనుంచి దూకేశాడని ఆవేదన ‍వ్యక్తం చేసింది.

ర్యాగింగ్ విషయం గురించి హాస్టల్‌ వార్డెన్‌ను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆనంద్ శర్మ తల్లి వాపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జితెన్ హజారికా చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సీఎం స్పందన..
ఈ ఘటనకు సంబంధించి మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే ప్రధాన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని సీఎం హిమంత బిశ్వ శర్మ సూచించారు. పోలీసులు తక్షణమే విచారణ చేపట్టి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చదవండి: పెళ్లి చేసుకోకపోతే.. ముక్కలు ముక్కలు చేస్తా.. అమ్మాయికి బెదిరింపులు..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top