వల వేసి దోచేస్తున్న సైబర్‌నేరగాళ్లు!

Cyber Frauds On The Rise: Here Is How To Protect Your Data And Money From Fraudsters - Sakshi

వల వేసి దోచేస్తున్న సైబర్‌ నేరగాళ్లు 

క్యూఆర్‌ కోడ్‌ స్కాన్, లింక్‌ ఓపెన్‌ చేసినా నష్టమే 

ఫేస్‌బుక్, వీడిమో కాల్స్, ఓఎల్‌ఎక్స్‌ మోసాలు 

క్షణాల్లో అకౌంట్లలోని డబ్బులు మాయం 

పెరుగుతున్న సైబర్‌ క్రైమ్‌తో ఆందోళన  

సాక్షి, గచ్చిబౌలి: సైబర్‌ మోసగాళ్లు ఎక్కడో మాటువేసి లేరు. మన అరచేతిలో ఉండే సెల్‌ ఫోన్‌లోనే  దాగి ఉన్నారు. అపరిచిత వ్యక్తులు పంపే క్యూ ఆర్‌ కోడ్, లింక్‌ ఓపెన్‌ చేస్తే ఇట్టే బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోతాయి.  ఆ వివరాలతో మన అకౌంట్‌లోని డబ్బు స్వాహా చేస్తారు. మొబైల్‌ ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లు, లింకులు, వీడియో కాల్స్‌పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఎన్నో రకాలుగా సైబర్‌ మోసగాళ్లు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో గత మార్చి 21 నుంచి ఐటీ కారిడార్‌లోని మూడు పోలీసుస్టేషన్ల పరిధిలో అధికంగా సైబర్‌ క్రైమ్‌ కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరిగిపోతుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు.  

ఐటీ కారిడార్‌లో కేసులు ఇలా ... 
 ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం పోలీస్‌ స్టేషన్లలో నమోదైన సైబర్‌ క్రైమ్‌ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి.  కేవలం 20 రోజుల వ్యవధిలోనే మూడు పీఎస్‌ల పరిధిలో 43 కేసులు నమోదయ్యాయి. అయితే, వాస్తవంగా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని,  సైబర్‌ మోసగాళ్ల బారినపడ్డ చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని పలువురు పేర్కొంటున్నారు.   

మోసం చేసే తీరు ఇలా......  
 పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే కస్లమర్‌ కేర్‌ నంబర్‌ కోసం కొందరు గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. 
 అయితే, సదరు యాప్‌ల పేరుతో సైబర్‌ నేరగాళ్లు నిక్షిప్తం చేసిన నకిలీ నంబర్లు కనిపించడంలో వాటిని తీసుకున్నారు. 
 ఆ నంబర్‌కు ఫోన్‌ చేయగానే ఐదు అంకెల ఓటీపీని పంపారు. ఆ ఓటీపీని రిటర్న్‌ పంపమని సైబర్‌ నేరగాళ్లు చెప్పారు. పంపగానే అకౌంట్‌లోని డబ్బులు మాయం కావడంతో బాధితులు గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఒకరు రూ.38 వేలు, మరొకరు రూ.35 వేలు అకౌంట్ల నుంచి డెబిట్‌ అయ్యాయి. ఇలాంటివి నాలుగైదు కేసులు గచ్చిబౌలి పీఎస్‌లోనే నయోదయ్యాయి. 
 గచ్చిబౌలి, రాయదుర్గం పీఎస్‌ పరిధిలో ఓఎల్‌ఎక్స్‌ ఫ్రాడ్‌ కేసులు నమోదయ్యాయి. 
► ఓఎల్‌ఎక్స్‌లో పెట్టిన వస్తువులు నచ్చాయని అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేసి క్యూ ఆర్‌  కోడ్‌ పంపాడు.  ఒక రూపాయి పంపమని అడగగానే బాధితులు పంపారు. దీంతో బ్యాంక్‌ ఖాతా వివరాలు సైబర్‌ నేరగాళ్లకు తెలిసిపోవడంతో మరుక్షణమే అకౌంట్‌లోని డబ్బులు డెబిట్‌ అయ్యాయి. ఇలా నాలుగురైదుగురు బాధితులు ఫిర్యాదు చేశారు. 
 అపరిచిత మహిళ ఫేస్‌బుక్‌ వీడియో కాల్‌ చేస్తే ఓ వ్యక్తి సరదాగా మాట్లాడాడు.  మాటల్లో పెట్టి ఆ మహిళ తన ఒంటిపై ఉన్న దుస్తులను విప్పేసింది. మీరు కూడా దుస్తులు విప్పేయండి అని చెప్పడంతో అతను కూడా అలా చేశాడు. ఇద్దరి న్యూడ్‌ వీడియోను రికార్డ్‌ చేసింది. కాల్‌ కట్‌ అయిన వెంటనే అతడి వాట్సాప్‌కు ఇద్దరి న్యూడ్‌ వీడియోను పంపించింది.  
  డబ్బులు పంపకుంటే ఇద్దరి న్యూడ్‌ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేస్తానని బెదిరించింది. దీంతో కంగుతిన్న అతగాడు చేసేది ఏమీ లేక రూ. 8 వేలు పంపాడు. మళ్లీ వీడియో కాల్‌ చేసి రూ.30 వేలు డిమాండ్‌ చేయడంతో గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఫేస్‌బుక్‌ ఖాతాను బ్లాక్‌ చేసి కేసు నమోదు చేశారు. 
 ‘నేను ఆర్మీ ఆఫీసర్‌ని, నాకు హైదరాబాద్‌ ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. మాజిక్‌ బ్రిక్స్‌ డాట్‌ కామ్, 99 ఎకరాస్‌ డాట్‌ కామ్‌లో అద్దెకు ఉంచిన ఇళ్లు 
నచ్చింది’అని ఇంటి యజమానికి ఓ అపరచితుడు ఫోన్‌ చేశాడు. రూ.10 వేలు అడ్వాన్స్‌ పంపిస్తానని చెప్పి లింక్‌ పంపాడు.  ఆ లింక్‌ను 
  ఓపెన్‌ చేసిన కొద్ది సేపటికే యజమాని అకౌంట్‌లోని రూ.70 వేలు డెబిట్‌ అయ్యాయి. దీంతో బాధితుడు గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. 
 ఉత్తరాఖండ్‌లో ఆర్మీ అధికారిగా పని చేస్తున్నానని రూ.18 వేలకు బుల్లెట్‌ అమ్ముతానని అపరిచిత వ్యక్తి ఫొటోలు పెట్టాడు. ఓ వ్యక్తి అతడిని సంప్రదించి ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీల కోసం ఆరు వేలు పంపాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్‌ చేసి ట్రాన్స్‌పోర్ట్‌ రిసీప్ట్‌ పంపి సెక్యూరిటీ డిపాజిట్‌ కోసం మళ్లీ డబ్బు కావాలని అడిగాడు. ఇలా రూ.40 వేలు సమర్పించుకొని చివరికి మోసపోయానని గ్రహించిన బాధితుడు గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు 
  క్యూర్‌ కోడ్‌ పంపి అకౌంట్లలోని క్యాష్‌ డెబిట్‌ అయిన కేసులు మాదాపూర్‌ పీఎస్‌ లోనూ నమోదయ్యాయి.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top