కుమార్‌ వర్మ కుమ్మేశాడు! పెట్టుబడి పేరుతో కోట్లు కొట్టేశాడు

Convicted Of Fraud In The Name Of Non Profit Company Shares - Sakshi

సాక్షి హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి నగరానికి వలసవచ్చి, సూపర్‌ సర్ఫేసెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్వహిస్తున్న కుమార్‌ శ్రీనివాస్‌ పెనుమత్స వర్మ అలియాస్‌ కుమార్‌ వర్మ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రవాస భారతీయుడిని రూ.7 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఇతగాడిని మూడు రోజుల క్రితం సైబరాబాద్‌ ఈఓడబ్ల్యూ అధికారులు అరెస్టు చేసిన విషయం విదితమే. తనకు సన్నిహితుడైన మణికొండ వాసిని కూడా ఇతగాడు వదిలిపెట్టలేదు. కంపెనీలో షేర్లు ఇస్తానంటూ పెట్టుబడుల పేరుతో రూ.కోటి వరకు తీసుకుని మోసం చేశాడు.

ఈ మేరకు నార్సింగి ఠాణాలో కేసు నమోదై ఉంది. ఈ కేసులో కుమార్‌ వర్మను పీటీ వారెంట్‌పై అరెస్టు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మణికొండ ప్రాంతానికి చెందిన వ్యాపారి కుటుంబం, కుమార్‌ వర్మ కుటుంబం కొన్నేళ్లుగా సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ పరిచయంతో పాటు వ్యాపార వివరాలు తెలిసిన బాధితులు తొలుత కుమార్‌ వర్మకు భారీ మొత్తం అప్పుగా ఇచ్చారు. ఆ తర్వాత వీరి నుంచి మరికొంత మొత్తం  తీసుకుంటూ అత్యంత లాభాల్లో ఉన్న తన కంపెనీలో షేర్లు ఇస్తానంటూ అంగీకరించాడు. వాస్తవానికి ఎలాంటి లాభాల్లో లేని కంపెనీ విలువను రూ.15 కోట్లుగా చూపిస్తూ పత్రాలు చూపించారు.

వీటి ఆధారంగా మరికొంత మొత్తం తీసుకున్న కుమార్‌ వర్మ త్వరలోనే షేర్లు బదిలీ చేస్తానన్నాడు. అలా చేయకుండా మోసం చేసిన నిందితుడు బాధితుడిని బోర్డు నుంచి తొలగిస్తున్నట్లు మెయిల్‌ పంపాడు. ప్రవాస భారతీయుడిని సైతం ఇదే పంథాలో మోసం చేసిన విషయం విదితమే.  బాధితుడు మొత్తం లెక్కలు వేయగా అతడికి రూ.1.08 కోట్లు రావాల్సి ఉన్నట్లు తేలింది. డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు కుమార్‌ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితుడు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.   

(చదవండి: నాడే చిక్కిన నాగమణి!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top