బ్లేడుతో గొంతుకోసుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Constable End His Life At Malakpet In Hyderabad - Sakshi

మలక్‌పేట: ఓ కానిస్టేబుల్‌ బ్లేడుతో గొంతుకోసుకుని ఆతహ్మత్యకు పాల్పడిన ఘటన మంగళవారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం, బాలాజీనగర్‌కు చెందిన బానోత్‌ భిక్షం, రేణుక దంపతులకు అభిలాష్‌ నాయక్‌(33), ప్రభునాయక్‌ ఇద్దరు కుమారులు. భిక్షం ఆటోడ్రైవర్‌. 40 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి మూసారంబాగ్‌ డివిజన్‌ బాలదానమ్మబస్తీలో స్థిరపడ్డారు.

గవర్నమెంట్‌ క్వార్టర్స్‌లో కింది పోర్షన్‌లో అభిలాష్‌ భార్యాభర్తలు, తల్లిదండ్రులు ఉంటుండగా.. రెండో ఫ్లోర్‌లో చిన్నకుమారుడు ప్రభునాయక్‌ ఉంటున్నాడు. అభిలాష్‌ నాయక్‌కు 2014లో కానిస్టేబుల్‌ ఉద్యోగం వచ్చింది. భార్య ఇంద్రజ్యోతి, ధీరజ్, హేమంత్‌ ఇద్దరు సంతానం. ఆరేళ్లుగా మాదన్నపేట పీఎస్‌లో విధులు నిర్వహిస్తుండగా.. చిన్నకుమారుడు ప్రభునాయక్‌ జీహెచ్‌ఎంసీ డిజాస్టర్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అభిలాష్‌ తన భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలను శుక్రవారం కోదాడకు తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టి ఇంటికి వచ్చాడు.

పడుకుంటానని చెప్పి..
సోమవారం ఉదయం విధులకు వెళ్లి మధ్యాçహ్నం 3 గంటలకే ఇంటికి వచ్చాడు. అన్నం తిన్న తర్వాత పడుకుంటానని చెప్పి రెండోఫ్లోర్‌ ఉన్న గదికి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. సాయంత్రం తల్లిదండ్రులు పిలిచినా పలకలేదు. నిద్రపోయాడని వారు భావించారు. రాత్రి 10 గంటలకు ప్రభునాయక్‌ ఇంటికి వచ్చాడు. అభిలాష్‌ను తీసుకువచ్చేందుకు పైకి వెళ్లాడు. ఎంత పిలిచినా పలకలేదు. దీంతో పక్కంటి వారి సహాయంతో ఇంటి తలుపు పగులగొట్టి చూడగా రక్తం మడుగులో మంచం పక్కన పడిఉన్నాడు. 

మిత్రుడి లోన్‌ కోసం ష్యూరిటీ..
పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకొని చూడగా బ్లేడుతో గొంతు, చేతి మణికట్టు కోసుకున్నాడు. అభిలాష్‌ నాయక్‌ తన మిత్రుడి లోన్‌ కోసం ష్యూరిటీ ఇచ్చిన కారణంగా చేతికి జీతం రావడం లేదు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నాడు. దీంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు అంటున్నట్లు పోలీసులు తెలిపారు.

అభిలాష్‌ గొంతుపై మూడుగాట్లు, ఎడమ చేతి మణికట్టుపై రెండు గాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై సుభాష్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. అంత్యక్రియల కోసం తల్లిదండ్రులు అభిలాష్‌ మృతదేహాన్ని సొంతూరు కోదాడకు తీసుకెళ్లారు.
చదవండి: సీఎం వీడియో మార్ఫింగ్‌ ట్యాబ్‌పై స్పష్టత ఇవ్వని ఉమా

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top