సీసీఎస్‌ అదుపులో స్కామ్‌ సూత్రధారులు? 

CCS Interrogates Telugu Academy Officials - Sakshi

తెలుగు అకాడమీ అధికారులను విచారించిన సీసీఎస్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు అకాడమీలో చోటు చేసుకున్న రూ.63.47 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ స్కామ్‌లో సూత్రధారులు హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులకు చిక్కినట్లు సమాచారం. మొత్తం నలుగురిలో ఇద్దరిని ఆదివారం అర్ధరాత్రి పట్టుకున్నారని తెలిసింది. మరోపక్క ఈ స్కామ్‌ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆదివారం అకాడమీ అధికారులతో పాటు కెనరా బ్యాంక్‌ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ స్కామ్‌కు సూత్రధారుల్లో ఒకరైన రాజ్‌కుమార్‌కు మరో రెండు మారుపేర్లు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.

అకాడమీకి చెందిన రూ.కోట్ల చెక్కులను రూపొందించేది అకౌంట్స్‌ ఆఫీసర్‌ రమేష్‌ అయినా.. వాటిని నిర్వహించేది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రఫీక్‌ అని తెలిసింది. ఇతడి ద్వారానే యూబీఐ, కెనరా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాల్సిన మొత్తాలకు సంబంధించిన చెక్కులు, కవరింగ్‌ లెటర్స్‌ రాజ్‌కుమార్‌కు చేరాయి. ఇదే అదునుగా భావించిన రాజ్‌కుమార్‌.. సోమశేఖర్, శ్రీనివాస్‌తో పాటు మరొకరి సాయంతో స్కామ్‌కు ప్లాన్‌ చేశాడు.  

అధికారుల నిర్లక్ష్యం... 
అకాడమీ నిధుల విషయంలో అధికారులు, సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారని సీసీఎస్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం మాజీ డైరెక్టర్‌ సోమిరెడ్డి, అకౌంట్స్‌ అధికారి రమేష్‌తో పాటు రఫీక్‌ను సీసీఎస్‌ పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అకాడమీ నిధుల నిర్వహణ విషయంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై ఆరా తీశారు. రఫీక్, రాజ్‌కుమార్‌ మధ్య ఉన్న సంబంధాలపై దృష్టి పెట్టారు. వీరిలో కొందరికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.

గడిచిన నెల రోజుల్లో అకాడమీలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ మొత్తం తమకు అప్పగించాల్సిందిగా పోలీసులు అధికారులను కోరారు. అయితే దాన్ని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి అందించామని వాళ్లు వివరణ ఇచ్చారు. దీన్ని పరిశీలిస్తే రాజ్‌కుమార్‌ అకాడమీకి ఎప్పుడెప్పుడు వచ్చాడు? ఎవరెవరిని కలిశాడు? అనేదానిపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు.

ఈ కేసులో అదనపు ఆధారాలు సేకరించడానికి ఇప్పటికే అరెస్టు చేసిన నిందితులైన ఏపీ మర్కంటైల్‌ కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌ చైర్మన్‌ సత్యనారాయణరావు, మేనేజర్లు పద్మావతి, మెహినుద్దీన్‌లతో పాటు యూబీఐ బ్యాంకు కార్వాన్‌ బ్రాంచ్‌ మాజీ ఛీప్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ సాబ్‌ను న్యాయస్థానం అనుమతితో కస్టడీకి తీసుకోవా లని నిర్ణయించి పిటిషన్‌ దాఖలు చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top