బెంగళూరు: టెలికాం స్టోర్‌లో పని చేసే ఓ యువతి తన ప్రియుడిని ఇంటికి పిలిచి, కొత్త తరహా ప్రపోజల్ అంటూ కళ్లకు గంతలు కట్టింది. ఆ తర్వాత అతడిని కుర్చీకి కట్టేసి, అతడికి నిప్పు అంటించింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. తన ప్రియుడు తనను పట్టించుకోలేదని కోపంతో ఆ యువతి ఈ ఘటనకు పాల్పడింది. అతడు కాలిపోతోంటే కెమెరాలో చిత్రీకరించి, అతను చనిపోయే వరకు చూస్తూ ఉండిపోయింది.
ఆ అమ్మాయి పేరు ప్రేర్నా(27). కిరణ్ (27)తో అదే టెలికాం స్టోర్‌లో పనిచేస్తోంది. వారిద్దరు ఏడాది పైగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇటీవలి కాలంలో కిరణ్ తనను పట్టించుకోవడం లేదని, తనను పెళ్లి చేసుకోడని ప్రేర్నాకు అనిపించింది. మంగళవారం ప్రేర్నా తన తల్లి, అన్నతో కలిసి నివసించే దక్షిణ బెంగళూరు అంజనాపుర ప్రాంతంలోని ఇంటికి కిరణ్‌ను పిలిచింది.
ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో కిరణ్ ఆమె ఇంటికి వచ్చాడు. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఆ యువతి అతని కళ్లకు గంతలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టింది. ఆ యువకుడు అభ్యంతరం చెప్పినప్పుడు.. విదేశాల్లో ప్రాచుర్యం పొందుతున్న విధంగా ప్రపోజ్ చేయాలనుకుంటున్నానని ఆ యువతి చెప్పింది.
కిరణ్ ప్రపోజల్ కోసం ఎదురు చూశాడు. అప్పటికే ముందుగా సిద్ధం చేసుకున్న పెట్రోల్ వంటి ద్రావణాన్ని అతడిపై పోసింది ప్రేర్నా. “ప్రేర్నాను అదుపులోకి తీసుకున్నాం. అతనికి ఆమె నిప్పు పెట్టి హత్య చేసినట్టు నిర్ధారణ అయ్యింది. ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అతను తనను పట్టించుకోలేదని ఆమె భావించింది” అని పోలీసులు తెలిపారు.


