జీవనాధారం కోల్పోయి.. ఊపిరి తీసుకున్న ఆటో డ్రైవర్‌

 Auto Driver Assassination By Stabbing Himself Lack Of Livelihood - Sakshi

సాక్షి(బంజారాహిల్స్‌): అన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నీ బాంఛన్‌.. నా జీవనాధారం నువ్వే లాక్కేళ్తే నా కుటుంబాన్ని ఎట్ల పోషించుకోవాలి.. రెండు నెలల్లో చిట్టీ వాయిదాలు చెల్లిస్తాను. నన్ను నమ్ము ఈ ఒక్కసారి కనికరించు అంటూ ఆ ఆటో డ్రైవర్‌ కాళ్లావేళ్లా పడ్డా సదరు లీడర్‌ వినిపించుకోలేదు. దీంతో కుటుంబాన్ని పోషించాల్సిన జీవనాధారమే లేకపోవడంతో ఓ ఆటో డ్రైవర్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసుల సమాచారం మేరకు... మహబూబ్‌నగర్‌ జిల్లా బూత్‌పూర్‌ మండలం కొత్తమొల్గర గ్రామం పరిధిలోని తుల్జాభవానీ తాండాకు చెందిన ఇస్లావత్‌ రవినాయక్‌(31) భార్య రాజి, ముగ్గురు కూతుళ్లు, కొడుకుతో కలిసి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 5లోని దుర్గా భవానీనగర్‌ బస్తీలో ఉంటూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఓ ప్లాట్‌ కొనుక్కోవడానికి అదే బస్తీలో ఉన్న ఓ లీడర్‌ వద్ద చీటీ వేశాడు. చీటి పాడుకున్న తర్వాత ఇటీవల కరోనా కారణంగా ఆటో సరిగ్గా నడవలేదు.

రెండు నెలలు వాయిదాలు చెల్లించలేకపోయాడు. దీంతో ఆయన ఆటోను సదరు చిట్టీ వ్యాపారి లాక్కెళ్లాడు. రెండు వారాలుగా ఆటో లేకపోవడంతో బతుకు రోడ్డును పడింది. తన ఆటోను ఇవ్వాలని రాత్రింబవళ్లు ఆటో నడిపి వాయిదాలు చెల్లిస్తానని మొత్తుకున్నా ఆ వ్యాపారి కనికరించలేదు. ఈ నెల 4వ తేదీన చివరి సారిగా ఆటో ఇవ్వాలంటూ సదరు లీడర్‌ను బతిమాలుకున్నా ఆయన వినిపించుకోలేదు. దీంతో తాను చీటి వ్యాపారిని బతిమిలాడిన విషయాన్ని ఆడియో రికార్డ్‌ చేసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ విషయం తెలుసుకున్న సదరు లీడర్లు మృతదేహాన్ని హుటాహుటిన స్వగ్రామానికి తరలించారు. అయితే అక్కడ పోలీసులు కేసు తీసుకోకపోగా శవపంచనామా కూడా చేయలేదు. ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నాడో అక్కడే ఫిర్యాదు చేయాలని చెప్పడంతో మృతురాలి భార్య రాజీతో పాటు ఆ గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస్, మరో వంద మంది గ్రామస్తులు ఆదివారం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. తన భర్త ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

(చదవండి: కుమార్‌ వర్మ కుమ్మేశాడు! పెట్టుబడి పేరుతో కోట్లు కొట్టేశాడు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top