చెడు వ్యసనాలకు అలవాటుపడి.. ఏటీఎం కార్డులు మారుస్తూ..

Atm Fraud In Nalgonda - Sakshi

సాక్షి, భువనగిరి(నల్లగొండ): ఏటీఎం కేంద్రాల్లో సహాయం కోరే ఖాతాదారుల ఏటీఎం కార్డులను మార్చి నగదును అపహరించుకుపోతున్న నిందితుడిని భువనగిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కె.నారాయణరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండల కేంద్రానికి చెందిన తూము రాజు అలియాస్‌ రాజేందర్‌  నెట్‌ సెంటర్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దీని ద్వారా వచ్చే డబ్బులు చాలకపోవడంతో చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. సులభంగా డబ్బులు సంపదించాలని, అందుకు యూట్యూబ్‌లో ఏటీఎం కార్డులను స్వైప్‌ చేసి మార్చే విధానాన్ని నేర్చుకుని ఎక్స్‌పర్ట్‌గా మారాడు. 

నగదు ఇలా అపహరిస్తాడు..
ఏటీఎం కేంద్రాలకు వచ్చే వృద్ధులను, ఏటీఎం కార్డు ఆపరేటింగ్‌ తెలియని వారిని గుర్తించి సహాయం చేస్తున్నట్లు నటిస్తాడు. అసలైన ఖాతాదారుల నుంచి ఏటీఎం కార్డును తీసుకొని వారికి నగదును తీసి ఇచ్చే క్రమంలో ఒరిజినల్‌ కార్డుమార్చి తన వద్ద మరో కార్డును వారికి ఇస్తాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయి నగదును డ్రా చేసుకుంటాడు. ఇలా ఇప్పటి వరకు చాలా చోట్ల ఏటీఎం కేంద్రాలలో నగదును అపహరించుక పోయాడు. 

బాధితుడి ఫిర్యాదుతో.. 
ఇటీవల భువనగిరి పట్టణానికి చెందిన కె. కృష్ణ తన బ్యాంకు ఏటీఎం కార్డును తీసుకుని డబ్బుల కోసం ఎస్‌బీఐ బ్యాంకు ఏటీఎం వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న రాజును ఏటీఎంలో నుంచి డబ్బులు తీసి ఇవ్వమని కోరగా రూ. 5 వేల నగదు తీసి ఏటీఎం కార్డును మార్చి ఇచ్చాడు. మరుసటి రోజు డబ్బులు అవసరమై కృష్ణ ఏటీఎం కేంద్రానికి వెళ్లగా ఆ కార్డు పనిచేయలేదు. దీంతో బ్యాంకుకు వెళ్లి ఆరా తీయగా మరొకరి పేరిట ఉందని అధికారులు తెలిపారు.  

మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అడిషనల్‌ డీసీపీ ఎన్‌. భుజంగరావు ఆధ్వర్యంలో పోలీసులు సీసీటీవీ పూటేజ్‌లను పరిశీలించారు. పాత నేరస్తులను గమనించారు. 4రోజులుగా పోలీసులు పట్ట ణంలోని అన్ని ఏటీఎం కేంద్రాల వద్ద నిఘా పెట్టారు. 23న సాయంత్రం సమయంలో ఓ ఏటీఎం వద్ద రాజు సహాయం చేస్తున్నట్లుగా ఉండటాన్ని గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాలను అంగీకరించాడు. 

నిందితుడిపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు
మోసాలకు పాల్పడుతున్న నిందితుడు రాజుపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. 2018 సంవత్సరంలో సిద్దిపేట పట్టణ పోలీస్‌స్టేషన్‌లో–2 , కరీంనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో –1 , 2019 సంవత్సరంలో భువనగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో–1 , 2020 సంవత్సరంలో జాగిత్యల పోలీస్‌ స్టేషన్‌లో–1 , 2021 సంవత్సరంలో గజ్వేల్‌ పోలీస్‌ స్టేషన్‌లో 2 కేసులు నమోదయ్యాయి. వివిధ ప్రాంతాలలో మొత్తం రూ.9.12 లక్షలను అపహరించాడు.

నిందితుడినుంచి నుంచి రూ.1.30లక్షలు, రెండు సెల్‌ ఫోన్లను, వివిధ బ్యాంకులకు చెందిన 15 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. కేసును ఛేదించిన అడిషనల్‌ డీసీపీ, సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని అభినందించారు. నిందితుడిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని చెప్పారు. అపరితులకు ఏటీఎం కార్డులను ఇవ్వవద్దని ఆయన సూచించారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీ ఎన్‌. భుజంగరావు, పట్టణ సీఐ సుధాకర్, ఎస్‌ఐ వెంకటయ్య, కానిస్టేబ్‌లు బాలస్వామి, మహేష్, సంపత్, అంజనేయులు పాల్గొన్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top