ఆర్యన్‌ ఖాన్‌కు మళ్లీ నిరాశే

Aryan Khans bail order reserved till October 20th - Sakshi

బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు 20వ తేదీకి వాయిదా

కోర్టులో ముగిసిన వాదనలు

బెయిల్‌ ఇవ్వొద్దని ఎన్‌సీబీ తరపు న్యాయవాది వినతి

కోవిడ్‌ పరీక్షల్లో ఆర్యన్‌కు నెగెటివ్‌

ముంబై: బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ దసరా పండుగ సమయానికి ఇంటికి చేరుకుంటాడన్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది. ఈ బెయిల్‌ పిటిషన్‌పై బుధ, గురువారాల్లో ఇరుపక్షాల మధ్య వాడీవేడిగా వాదనలు సాగాయి. ఆర్యన్‌ గత కొద్దికాలంగా డ్రగ్స్‌కి బానిసగా మారాడని, అతని వాట్సాప్‌ చాటింగ్‌లు చూస్తే ఈ విషయం తెలుస్తుందని, అందుకే అతడికి బెయిల్‌ మంజూరు చేయవద్దని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) తరపు న్యాయవాది అనిల్‌ సింగ్‌ కోరారు.

ఆర్యన్‌ దగ్గర డ్రగ్స్‌ ఏమీ లభించలేదు కాబట్టి అతనికి బెయిల్‌ ఇవ్వాలని వాదించడం సరికాదన్నారు. ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం నిందితుడి వద్ద డ్రగ్స్‌ లభించడం కీలకమైన అంశం కాదని చెప్పారు. నిందితుడికి బెయిల్‌ మంజూరు చేస్తే తమ విచారణ ముందుకు సాగదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో అరెస్టయిన వారంతా వయసులో చిన్న వాళ్లని, వారికి బెయిల్‌ ఇవ్వాలంటూ ఆర్యన్‌ తరఫు లాయర్‌ అమిత్‌ దేశాయ్‌ చేసిన వాదనలను అనిల్‌ సింగ్‌ వ్యతిరేకించారు.

వీరంతా భావి భారత పౌరులని, మాదకద్రవ్యాలు సేవించడం చట్ట వ్యతిరేకమని తెలిసి కూడా ఆ పని చేశారని ఆక్షేపించారు. మరోవైపు విదేశాల్లో ఆర్యన్‌ ఖాన్‌ మాదక ద్రవ్యాలు సేవించాడన్న అనిల్‌ సింగ్‌ వాదనల్ని అమిత్‌ వ్యతిరేకించారు. ఆర్యన్‌ ఇటీవల వెళ్లిన దేశాల్లో డ్రగ్స్‌ సేవించడం చట్టబద్ధమైన చర్యేనని గుర్తుచేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు. సోషల్‌ మీడియాలో, కోర్టు వెలుపల షారుక్‌ ఖాన్‌ అభిమానులు ఆర్యన్‌కు మద్దతుగా నిలిచారు. అతనికి బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కోర్టు బయట నినాదాలు చేశారు.

కరోనా పరీక్షల్లో నెగెటివ్‌
ముంబై ఆర్థర్‌ రోడ్డు జైల్లో ఇన్నాళ్లూ క్వారంటైన్‌ బ్యారెక్‌లో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌ను ఇతర ఖైదీలు ఉండే సెల్‌కి అధికారులు తరలించారు. కోవిడ్‌–19 పరీక్షల్లో ఆర్యన్‌ సహా ఇతర నిందితులందరికీ నెగెటివ్‌ రావడంతో వారిని సాధారణ సెల్‌లో ఉంచినట్టు జైలు సూపరింటెండెంట్‌ నితిన్‌ వేచల్‌ చెప్పారు.

బిస్కెట్లు తింటూ..
ఆర్థర్‌ రోడ్డు జైలులో ఆర్యన్‌ ఖాన్‌ కేవలం బిస్కెట్లు తిని రోజులు గడుపుతున్నాడని తెలుస్తోంది. ముంబైలో స్థానిక మీడియా రాస్తున్న కథనాల ప్రకారం జైలులో ఇచ్చే భోజనం తినడానికి ఆర్యన్‌ నిరాకరించాడు. జైలు క్యాంటిన్‌ నుంచి కొనుక్కుంటున్న బిస్కెట్లు తింటూ కాలం గడిపేస్తున్నాడు. తనతో పాటు తీసుకువెళ్లిన 12 మంచినీళ్ల బాటిల్స్‌ నీళ్లతోనే కాలం నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడు ఆ నీళ్లు కూడా అయిపోతున్నాయని, తమ కుమారుడి దుస్థితిని తలచుకొని షారుక్‌ ఖాన్, గౌరి దంపతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ముంబై మీడియా కథనాలు రాస్తోంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top