రూ.1000 కోట్లు విలువైన కొకైన్‌ పట్టివేత

400 kg of Cocaine Seized in Thoothukudi - Sakshi

తూత్తుకుడి: విమానాశ్రయాలు బంగారు అక్రమ రవాణాకు అడ్డ అయితే.. ఓడరేవులు డ్రగ్స్ సరఫరాకు అడ్డాగా మారుతున్నాయి. తమిళనాడులో మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా భారీ ఎత్తున మత్తు పదార్దాలు పట్టుబడుతున్నాయి. తాజాగా ఇతర దేశాల నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా వేలాది కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని తూత్తుకుడిలోని వీవీఓసీ ఓడరేవు వద్ద విదేశాల నుంచి అక్రమంగా రవాణా చేసిన రూ.1000 కోట్లు విలువైన కొకైన్‌ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

శ్రీలంక నుంచి ఓడ ద్వారా రవాణా చేస్తున్న సమయంలో ఈ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల తూత్తుకుడిలోని ఓడరేవు వద్దకు వచ్చిన ఓడ కంటైనర్లను అధికారులు తనిఖీ చేస్తున్నప్పుడు ఈ స్మగ్లింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. కలప కంటైనర్‌లోని సంచుల్లో సుమారు 400 కిలోగ్రాముల కొకైన్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కొకైన్ ఎక్కడ నుంచి వచ్చిందో నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఏ ప్రాంతం నుంచి ఇంత పెద్ద ఎత్తున భారీగా మాదకద్రవ్యాలను పంపించారో పోలీసులు విచారిస్తున్నారు. కంటైనర్ ఎవరిది? ఇది ఎక్కడ నుండి వచ్చింది.. ఎవరు ఆదేశించారు.. అందులో డ్రగ్స్ ఎవరు పెట్టారో తెలుసుకోవడానికి చెన్నై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు పోర్టు ఉద్యోగులు, అటు నౌక సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా అన్న కోణంలోనూ కేసును విచారిస్తున్నారు. ఇప్పటికే విమానాశ్రయాలు బంగారు అక్రమ రవాణాకు కేంద్రాలుగా మారుతుంటే, ఓడరేవులు మాదకద్రవ్యాల రవాణాకు కేంద్రాలుగా మారుతున్నాయి. తమిళనాడు విమానాశ్రయంలో ఇటీవల జరిపిన సోదాల్లో వందల కిలోల బంగారం అక్రమంగా దొరికింది. షిప్పింగ్ పోర్టులో డ్రగ్స్ రవాణా ఇటీవల పెరిగింది. మాదకద్రవ్యాలను తరచూ రవాణా  చేస్తుండగా సీజ్‌ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. విదేశాల నుంచి నేరుగా డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో పట్టుకోవడం ఇదే మొదటిసారి. 4 వందల కిలోల కొకైన్ విలువ సుమారు 1000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

చదవండి: ఉరి తాడుగా మారిన ఉయ్యాల

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top