Crime News: మరణ మృదంగం! ఒక్కరోజులోనే 15 మంది మృతి.. కారణాలేవేర్వేరు!

15 Killed In Various Incidents In Vijayawada - Sakshi

శనివారం ఒక్కరోజే జిల్లాలో 15 మంది మృతి 

ఆత్మహత్యకు పాల్పడిన నలుగురు కుటుంబ సభ్యులు 

బైక్‌ ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం  

ఇతర ఘటనల్లో మరో ముగ్గురు మృతి

సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో వివిధ ఘటనల్లో శనివారం ఒక్క రోజే 15 మంది మరణించారు. అప్పుల బాధ తాళలేక నలుగురు సభ్యులున్న కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. రోడ్డు ప్రమాదాలు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మిది మందిని బలితీసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో మరణించిన ఏడుగురూ బైక్‌లపై ప్రయాణిస్తున్న వారే కావడం విషాదం. మృతుల్లో ఇద్దరు స్వయానా అన్నదమ్ములు. మరో ఇద్దరు ప్రాణ స్నేహితులు కావడం విశేషం.  

అన్నదమ్ముల విషాద గీతం  
ఎ.కొండూరు మండలంలో గొల్లమంద గ్రామానికి చెందిన తేళ్లూరి బాబు (51) గోపాలపురం జీళ్లకుంట సమీపంలో జాతీయ రహదారిపై మోటారు సైకిల్‌ మీద వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న తమ్ముడు ఆర్టీసీ కండక్టర్‌ రామారావు (46) తిరువూరు నుంచి ఘటన స్థలానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా జీళ్లకుంట సమీపంలోనే వెనుక నుంచి కారు ఢీకొనడంతో అక్కడే ప్రాణం విడిచాడు. ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరూ మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీమున్నీరుగా విలపిస్తున్నారు.  

కొండపల్లిలో ఇద్దరు బాలురు మృతి 
కొండపల్లి శ్రామికనగర్‌ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పర్‌ లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు బాలురు దుర్మరణం పాలవగా మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కొండపల్లి ఎస్టీ కాలనీకి చెందిన మేచర్ల స్టాలిన్, బొజ్జగాని సాయిచరణ్, ఇట్టా సిద్ధార్థ స్థానిక పాఠశాలలో చదువుతున్నారు. సంక్రాంతి సెలవులు రావడంతో సరదాగా ముగ్గురు ద్విచక్రవాహనంపై కొండపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తుండగా అదుపు తప్పి టిప్పర్‌ లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని 108 వాహనంలో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే స్టాలిన్, సాయిచరణ్‌ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడ్డ సిద్ధార్థను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన బాలురిద్దరూ ప్రాణ స్నేహితులు.  

బైక్‌లు ఢీకొని మరో ఇద్దరు... 
ముదినేపల్లి మండలం చేపూరుపాలెంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మండలంలోని సింగరాయపాలేనికి చెందిన మారగాని నాని(35) బైక్‌పై చేవూరుకు, కలిదిండికి చెందిన పాము నాగరాజు(30) బైకుపై పెడన నుంచి కలిదిండికి వెళ్తున్నారు. చేవూరుపాలెం వద్ద వారి వాహనాలు ఢీకొని, ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతిచెందారు.  
  
కరకట్టపై మరొకరు దుర్మరణం
మోపిదేవి మండలం కె.కొత్తపాలెం కరకట్టపై రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో పుల్లా శరణ్‌దాస్‌(32) మృతి చెందారు. మృతుడు కోడూరు మండలం చినగుడుమోటు వాసిగా గుర్తించారు.
  
మరో ఘటనలో ఇంజినీరింగ్‌ విద్యార్థి.. 
చాట్రాయికి చెందిన సుమిత్‌కుమార్‌ (20) విజయవాడ కానూరులోని వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్నాడు. శనివారం తెల్లవారుజాముమన బైక్‌పై సుమిత్‌కుమార్, అతని స్నేహితుడు ద్వారకతో కలిసి మచిలీపట్నం బీచ్‌కు వెళ్తుండగా కంకిపాడు మండలం కొణతనపాడు అడ్డరోడ్డు వద్ద విజయవాడ వైపు వస్తున్న ట్రాక్టరు ఢీకొంది. ఈ ఘటనలో సుమిత్‌కుమార్‌ మృతి చెందాడు. ద్వారక గాయాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  

మరో మూడు ఘటనల్లో ముగ్గురు.. 
పాయకాపురం భవానీబార్‌ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని శుక్రవారం రాత్రి చొప్పర చెన్నకేశవులు(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు రాధానగర్‌కు చెందిన వానిగా గుర్తించారు. ముసునూరు మండలం చింతలవల్లి గ్రామానికి చెందిన సరస్వతి రంగరాజు(48) తన కుమారుడు, మరో కూలీతో కలసి పామాయిల్‌ తోటలో గెలలు కోస్తూ ఉండగా ఇనుప గెడ కత్తి సమీపంలో ఉన్న విద్యుత్‌ తీగెలకు తగిలి విద్యుదాఘాతానికి గురై మరణించాడు. విజయవాడ బావాజీపేటలో తండ్రి మరణించాడని కొండ లాల్‌ముఖేష్‌  ఇంటిలో ఐరన్‌ రాడ్‌కు ఉరి వేసుకుని మృతిచెందాడు. నందిగామ మండలం మునగచర్ల వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మునగచర్లకు చెందిన నలజాల పూర్ణచంద్రరావు, చిరుమామిళ్ల బాలకృష్ణ ద్విచక్ర వాహనంపై పొలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులను 108 వాహనంలో నందిగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

చదవండి: గాల్లోకి ఎగిరి.. కూలీలపైకి దూసుకెళ్లిన కారు.. వివాహిత మృతి!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top