దళితులంటే ఎందుకీ వివక్ష ? | - | Sakshi
Sakshi News home page

దళితులంటే ఎందుకీ వివక్ష ?

Sep 20 2026 6:36 AM | Updated on Sep 20 2026 6:36 AM

రెండేళ్లలో 25 మంది దళితులు హత్యకు గురైతే పట్టించుకోని కూటమి ప్రభుత్వం చీకటి గోపి హత్యపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ చేయాలి మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

శ్రీరంగరాజపురం : దళితుడైన చీకటి గోపి హత్యపై న్యాయవిచారణ జరిపించాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్‌ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు, ప్రజా సంఘలు, వివిధ పార్టీలతో కలసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పుత్తూరులోని తన నివాసంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన దళిత యువకుడు చీకటి గోపి(30) ఉంగరం దొంగతనం చేశారని నెపంతో తాడికొండ పోలీసులు ఎలాంటి నోటీసులు లేకుండా విచక్షణారహితంగా దాడిచేసి, చిత్ర హింసలకు గురిచేసి లాకప్‌ డెత్‌కు కారణమయ్యారన్నారు. అయితే ఆ పోలీసులపై కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే దళితుల మరణాలపై కూటమి ప్రభుత్వం ఎంత వివక్ష చూపిస్తుందో అర్థంవుతోందని అన్నారు. జనసేన పార్టీ కార్యకర్త అయిన చీకటి గోపి చనిపోతే ఇంతవరకు డీప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ మాట్లాడడం లేదని, అదే అగ్రవర్ణాలకు జరిగుంటే మౌనంగా ఉండేవారా అని ప్రశ్నించారు. ఎందుకంటే చీకటి గోపి ఒక దళితుడని, దళితులకు ఏం జరిగినా ఎవరూ పట్టించుకోరనే ధైర్యంతో కూటమి ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర హోం మంత్రి అనిత, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. నేను పెద్ద మాదిగ అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు దళితులను హత్యలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. అదే కమ్మ సామాజిక వర్గానికి చెంది వీరయ్యచౌదరి, లక్ష్మణ నాయుడు కక్షల ద్వారా గొడవపడి చనిపోతే వారికి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా, 10 ఎకరాల పొలం, వారి భార్యలకు రాష్ట్ర గ్రంథాలయం చైర్మన్‌ పదవి ఇచ్చారన్నారు. అదే దళితులు 25 మంది చనిపోతే ఒక్క రూపాయి అయినా ఎక్స్‌గ్రేషియా ప్రకటించరా అని ప్రశ్నించారు. చీకటి గోపి హత్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మందకృష్ణ మాదిగ కూడా దళితులపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతున్నారని, ఈ విషయంపై ముఖ్యమంత్రిని నిలదీయాలన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై పోరాటం చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు కలసి రావాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి, ప్రజల మేలు కోరే జగనన్న ప్రభుత్వానికి కృషి చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement