అయ్య బాబోయ్‌ సీఎం పర్యటనా ! | - | Sakshi
Sakshi News home page

అయ్య బాబోయ్‌ సీఎం పర్యటనా !

Sep 20 2026 6:54 AM | Updated on Sep 20 2026 6:54 AM

చేతిలో పైసల్లేవ్‌.. ఏర్పాట్లు ఎట్లా?

తలలు పట్టుకుంటున్న అధికారిక యంత్రాంగం

పేరుకుపోయిన సీఎం పర్యటన బకాయిలు

బిల్లులివ్వరు.. ఆర్భాటాలకు తక్కువ లేదు

తాజాగా ఈ నెల 21, 22 తేదీల్లో కుప్పంలో సీఎం పర్యటన

చిత్తూరు కలెక్టరేట్‌ : ‘అయ్యబాబోయ్‌... మళ్లీ సీఎం పర్యటనా? అంటూ జిల్లా యంత్రాంగం, అధికార వర్గాలు బెంబేలెత్తిపోతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో పలుమార్లు పర్యటించారు. ఆయా పర్యటనల్లో వీఐపీ పర్యటనల నిర్వహణకు ఖర్చు చేసిన ప్రభుత్వ నిధులు, బకాయి బిల్లులు నేటికీ విడుదల కాకపోవడంతో అధికారిక యంత్రాంగం భయాందోళనకు గురవుతోంది. ముఖ్యమంత్రి పర్యటన అంటే సాధారణంగా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా ఏర్పాట్లు చేయాలి. కానీ, చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా మారింది. సీఎం పర్యటనల నిమిత్తం ఖర్చు చేసిన ప్రభుత్వ నిధులు, బకా యి బిల్లులు నేటికీ విడుదల కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

రూ. 21.50 కోట్ల బకాయిలు పెండింగ్‌

జిల్లాలో సాధారణంగా ఒక్క రోజు సీఎం పర్యటనకు రూ.40 నుంచి 70 లక్షలు, రెండు రోజుల పర్యటనకు రూ.1 కోటి నుంచి రూ.1.50 కోటి వరకు ఖర్చు అవుతుందని అధికారుల అంచనా. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటివరకు జిల్లాలో జరిగిన సీఎం పర్యటనల ఏర్పాట్ల నిమిత్తం ఖర్చుచేసిన బిల్లులు ఏకంగా రూ.21.50 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీఐపీ పర్యటనలు ఖరారైన ప్రతిసారీ స్టేజీలు, మైక్‌ సెట్లు, షామియానాలు, తాత్కాలిక హెలిప్యాడ్‌ల నిర్మాణం, రవాణా, పారిశుధ్యం, భద్ర త, ప్రొటోకాల్‌ ఏర్పాట్లు వంటి అత్యవసర పనుల కోసం నిధులు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేయాలో తెలియక జిల్లా యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. గతంలో ముఖ్యమంత్రి పర్యటనలు జరిగితే నిధుల మంజూరు ప్రక్రియ వేగంగా జరిగేదని, కానీ ప్రస్తుతం ఈస్థాయి బకాయిలు పేరుకుపోవడం, కాంట్రాక్టర్లకు జవాబు చెప్పలేక సతమతమవడం వంటి దుస్థితి ఎప్పుడూ ఎదురవ్వలేదని స్థానిక అధికారులు అంతర్గత సంభాషణల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

21, 22 తేదీల్లో సీఎం జిల్లా పర్యటన

ఇదిలా ఉండగానే, సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 21, 22 తేదీల్లో (సోమ, మంగళవారాల్లో) చిత్తూ రు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో రెండు రోజు ల పాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే పర్యటనల సందర్భంగా వేదికల నిర్మాణాలు, రంగురంగుల ఫ్లెక్సీ లు, ఆర్భాటాలు, హంగామాపై ఉన్న ఆసక్తి.. క్షేత్రస్థాయిలో అయ్యే వ్యయానికి సంబంధించిన నిధుల మంజూరుపై చూపకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నూతన పర్యటన ఖర్చులకు తోడు, పాత బకాయిలు ఎలా క్లియర్‌ అవుతాయో తెలియక అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

సీఎం జిల్లా పర్యటనలు ఇలా

2025 జనవరి 6,7,8 తేదీల్లో కుప్పం పర్యటన

2025 మార్చి 1 జీడీ నెల్లూరు మండలం పర్యటన

2025 మే 21 కుప్పం పర్యటన

2025 మే 25 కుప్పం పర్యటన

2025 జూలై 1,2 కుప్పం పర్యటన

2026 జనవరి 24 నగరి పర్యటన

2026 జనవరి 30 కుప్పం పర్యటన

2026 మే 23 యాదమరి మండలం పర్యటన

2026 జూలై 4 కుప్పం పర్యటన

2026 సెప్టెంబర్‌ 21,22 (తాజాగా) కుప్పం పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనల పేరుతో జరుగుతున్న ఆర్భాటాలు, ఏర్పాట్ల వెనుక ఉన్న ఆర్థిక భారం ఇప్పుడు జిల్లా యంత్రాంగాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. అయ్య బాబోయ్‌.. మళ్లీ సీఎం పర్యటనా? అంటూ అధికార వర్గాలు అంతర్గతంగా కలవరపడుతున్నాయి.

సీఎంవో దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు

జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు సీఎం పర్యటనల వ్యయం పేరుకుపోయిన బకాయిల అంశాన్ని పలుమార్లు ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి, ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు పర్యటన ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని యంత్రాంగాన్ని ఆదేశిస్తున్న ఉన్నతాధికారులు, అదే స్థాయిలో నిధుల విడుదలకు మాత్రం సుముఖత చూపకపోవడం గమనార్హం. పాత బకాయిల విడుదల విషయంలో వచ్చే సరికి మౌనం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement