కాణిపాకం: కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం ప్రత్యేక శ్రద్ధ వహించారు. దేవస్థానం ఈవో పెంచ ల కిషోర్‌తో కలసి ఆలయ పరిసర ప్రాంతాలు, క్యూలైన్లు, దర్శన ప్రాంగణాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పక్కా ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, అల్పాహారం, ఎండ తగలకుండా షెడ్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరిసర ప్రాంతా ల్లో పారిశుధ్య లోపం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక మెడికల్ క్యాంపులు, అంబు లెన్సులను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు, పోలీసు భద్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు సుఖవంతమైన దర్శనం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.


