ఇది రైతు దగాకోరు ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఇది రైతు దగాకోరు ప్రభుత్వం

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

● మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజం

వెదురుకుప్పం: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, కనీసం సాగు చేసిన పంటకు తగిన గిట్టుబాటు ధర లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టుకూడా లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ధ్వజమెత్తారు. గురువారం మండలంలో పర్యటించిన ఆయనకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కొందరు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆయా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను నిర్మించి తద్వారా అన్ని రకాల సేవలను రైతులకు అందుబాటులోకి తెచ్చినట్లు గుర్తుచేశారు. ఆర్‌బీకేల్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు రాయితీ ద్వారా అలందించామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు. వరి సాగు చేసిన రైతులు మామిడి రైతులు, మిర్చి వంటి అనేక పంటలు సాగు చేసి గిట్టుబాటు ధర లేక కనీసం పెట్టిన పెట్టుబడులు సైతం రాని దాఖలాలు అనేకమన్నారు. మామిడి రైతులు పడినపాట్లు అన్నీఇన్నీకావన్నారు. పంటను నిల్వ చేసుకునేందుకు సరైన గోదాములు లేక కల్లాల్లోనే ధాన్యాన్ని నిల్వ చేసుకోవడంతో మగ్గి చివరికి పనికిరాకుండా పోతున్నాయని వాపోయారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను ఏవిధంగానూ ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు. ఇది మోసకారి ప్రభుత్వమన్నారు. పది మందికి అన్నంపెట్టే అన్నదాత అల్లాడుతుంటే ఏ ప్రభుత్వానికై నా మంచిదికాదన్నారు. అన్నదాతల ఆక్రందనలు సీఎం చంద్రబాబుకు శాపమని చెప్పారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు మండలంలో కలవగుంట జలాశయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ జలాశయాన్ని అభివృద్ధి చేస్తే సుమారు 32 చెరువులకు అనుసంధానం చేసి వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చెప్పారు. రైతుల పాలిట చంద్రబాబు ఎప్పుడూ శీతకన్ను చూపిస్తున్నారని తెలిపారు. బెల్లం రైతులు చితికిపోయారన్నారు. ధరలస్థిరీకరణతో రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement